చిన్నపాటి దుర్ఘటనా జరగకూడదు
జిల్లా సైక్లోన్ ప్రత్యేకాధికారి,
స్పెషల్ సీఎస్ అజయ్ జైన్
మహారాణిపేట: మోంథా తుపాను దృష్ట్యా అధికారులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, చిన్నపాటి దుర్ఘటన కూడా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా సైక్లోన్ ప్రత్యేకాధికారి, స్పెషల్ సీఎస్ అజయ్ జైన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్‌లతో సహా జిల్లా స్థాయి అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
జిల్లా యంత్రాంగం సన్నద్ధత
కలెక్టర్ హరేందిర ప్రసాద్ మాట్లాడుతూ... తుపానును ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపారు. కొండవాలు ప్రాంతాల్లో సుమారు 12,755 ఇళ్లు ఉన్నాయని, వాటిల్లో 96 ప్రమాదకర పరిస్థితుల్లో ఉండగా, సంబంధిత నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించామని వివరించారు. 20 సైక్లోన్ షెల్టర్లు, 23 పునరావాస కేంద్రాలలో 9,290 మందిని ఉంచడానికి ఏర్పాట్లు చేశామన్నారు. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో 430 బృందాలు, నేవీ, కోస్ట్ గార్డు సహకారంతో ఆరు మెకనైజ్డ్ బోట్లు, హెలికాప్టర్లు సిద్ధంగా ఉన్నాయని వివరించారు.
జీవీఎంసీ పరిధిలో అదనంగా 38 పునరావాస కేంద్రాలు, 20 క్విక్ రెస్పాన్స్ టీమ్స్ (క్యూఆర్‌టీ) నియమించినట్లు కమిషనర్ కేతన్ గార్గ్ పేర్కొన్నారు. ప్రతి బృందం జేసీబీ, ట్రిప్పర్, ట్రీ కట్టర్ వంటి పరికరాలతో సిద్ధంగా ఉందని తెలిపారు.
ఇలా చేయాల్సిందే..
● తుపాను తీరం దాటే దిశ మారవచ్చని, మంగళవారం ఉదయం నుంచి గాలుల తీవ్రత పెరుగుతుందని అధికారులు సిద్ధంగా ఉండాలని జిల్లా సైక్లోన్ ప్రత్యేకాధికారి, స్పెషల్ సీఎస్ అజయ్ జైన్ ఆదేశించారు.
● మ్యాన్ హోల్స్‌ను సరిచేయాలి. ప్రమాద ప్రాంత ప్రజలను రక్షిత భవనాలకు తరలించాలి.
● రక్షిత కేంద్రాలలో తాగునీరు, ఆహారం, పాలు, మందులు అందుబాటులో ఉంచాలి.
● నష్టం వాటిల్లిన ప్రాంత ప్రజలకు, ప్రయాణికులకు అందించేందుకు 29న టిఫిన్, భోజనం ప్యాకెట్లను సిద్ధం చేయాలి.
● దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలు, డ్రైన్లను డ్రోన్ల సహాయంతో గుర్తించి తక్షణ చర్యలు చేపట్టాలి.


