కార్పొరేటర్ బొండాపై అట్రాసిటీ కేసు
కూర్మన్నపాలెం: జీవీఎంసీ 87వ వార్డు కార్పొరేటర్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొండా జగన్నాథంపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద దువ్వాడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. వార్డులోని సిద్ధార్థనగర్‌లో నివసించే తాడిగిరి ప్రకాశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జగన్నాథంపై కేసు నమోదు చేసి, ఎస్.ఐ. డెంకాడ శ్రీనివాసరావు దర్యాప్తు చేస్తున్నారు. బీహెచ్‌పీవీలో ఉద్యోగ విరమణ చేసిన ప్రకాశ్.. సిద్ధార్థనగర్‌లో కుటుంబ సభ్యులతో నివసిస్తున్నారు. ఆయన మొదటి భార్య 1997లో మరణించడంతో, రెండో వివాహం చేసుకున్నారు. రెండో భార్యకు కూడా ఒక కుమార్తె జన్మించగా, అందరూ కలిసి జీవిస్తున్నారు. అయితే కొంతకాలంగా భార్యాభర్తల మధ్య ఆస్తి తగాదాలు మొదలయ్యాయి. తనకున్న అప్పులు తీర్చిన తర్వాతే అందరికీ ఆస్తులు పంచుతానని ప్రకాశ్ తన భార్యకు చెబుతూ వచ్చారు. ఈ సమయంలో అదే కాలనీలో నివసించే జాన్ రమేష్ అనే వ్యక్తి ఈ కుటుంబ వివాదంలో జోక్యం చేసుకుని, సమస్యను వీధిలోకి తెచ్చాడు. అంతటితో ఆగకుండా, వార్డు కార్పొరేటర్ బొండా జగన్నాథం దగ్గరకు తీసుకువెళ్లి పంచాయితీ పెట్టించాడు. అనంతరం భార్యకు రూ. 30 లక్షలు, తమకు కమీషన్ కింద మరో రూ.3 లక్షలు ఇవ్వాలని జాన్ రమేష్, జగన్నాథం తనపై ఒత్తిడి తెచ్చారని బాధితుడు ప్రకాశ్ తెలిపారు. అంతేకాకుండా తాము చెప్పినట్లు వినకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని జాన్ రమేష్ బెదిరించినట్లు ప్రకాశ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఏడాది మే నుంచి తరచూ ఫోన్ చేసి బెదిరించడం, దుర్భాషలాడడం వల్ల మనశ్శాంతి లేకుండా పోయిందని ఆయన వివరించారు. ప్రకాశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు జాన్ రమేష్‌ను ఏ–1గా, కార్పొరేటర్ బొండా జగన్నాథంను ఏ–2గా నిర్థారిస్తూ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారు.


