మోంథా ముప్పు
ఆదివారం రాత్రి ద్వారకానగర్‌లో కురుస్తున్న వర్షం
ఆరిలోవ: తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున, జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు రెండు రోజుల పాటు అత్యవసర సెలవులు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్. ప్రేమకుమార్ ఆదివారం తెలిపారు. కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ ఆదేశాల మేరకు సోమవారం , మంగళవారం సెలవు దినాలుగా ప్రకటించారు. సెలవులు ప్రకటించినప్పటికీ, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఏఈవోలు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని డీఈవో సూచించారు. జిల్లా స్థాయిలో డీఈవో కార్యాలయంలో, మండల స్థాయిలో ఎంఈవో కార్యాలయాలలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారని తెలిపారు. సెలవు ఆదేశాలను ఉల్లంఘించి ఈ రెండు రోజులలో పాఠశాలలను తెరిచిన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఈవో హెచ్చరించారు. తుఫాన్ పరిస్థితులు చక్కబడే వరకు అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు.
ఏయూకు సెలవులు
మద్దిలపాలెం: ఆంధ్రాయూనివర్సిటికి సోమ, మంగళవారం సెలవు ప్రకటిస్తున్నట్టు ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలను రెండు రోజులు పాటుసెలవులుప్రకటించాలని ఆదేశించడంతో ఏయూ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుందన్నారు.
వాల్తేర్ డివిజన్ అప్రమత్తం
తాటిచెట్లపాలెం: తుఫాన్ ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే, వాల్తేర్ డివిజన్ అప్రమత్తమైంది. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు, గాలుల కారణంగా రైల్వే ట్రాక్‌లు, బ్రిడ్జిలు, సిగ్నలింగ్ వద్ద ఎటువంటి అంతరాయం కలగకుండా నిరంతర పర్యవేక్షణ ఏర్పాటు చేసినట్లు డివిజన్ అధికారులు తెలిపారు. తక్షణ సహాయక చర్యల కోసం స్థానిక ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుంటున్నామని, వాతావరణ శాఖ సూచనలతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.డివిజన్ పరిధిలోని స్టేషన్లలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. ప్రయాణాలను రద్దు చేసుకునే వారికి రిఫండ్స్ అందించడానికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు.
విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, దువ్వాడ, రాయగడ స్టేషన్లలో సోమవారం నుంచి సమాచారం కోసం హెల్ప్‌డెస్క్‌లు అందుబాటులో ఉంటాయన్నాని డీఆర్‌ఎం లలిత్ బోహ్రా తెలిపారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని ఆయన ఆదేశించారు.
అధికారుల అప్రమత్తం విద్యాసంస్థలకు నేడు, రేపు సెలవులు సాగరతీరాలు, పర్యాటక ప్రాంతాల మూసివేత కలెక్టరేట్, భీమిలిలో కంట్రోల్ రూంల ఏర్పాటు కొండవాలు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి కలెక్టర్, సీపీ ఆధ్వర్యంలో పర్యవేక్షణ
నేడు, రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవు
మహారాణిపేట: సోమవారం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున తమ సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నట్లు 108 భవ్య అంబులెన్స్ జిల్లా మేనేజర్ సురేష్ తెలిపారు. కలెక్టర్, డీఎంహెచ్‌వో, సంస్థ నుంచి అందిన ఆదేశాల మేరకు 108 సిబ్బంది సెలవులను రద్దు చేసినట్లు ఆయన ఆదివారం ప్రకటించారు. 108 కాల్ సెంటర్‌ను కూడా అప్రమత్తం చేసి, అత్యవసర కాల్స్ వచ్చిన వెంటనే స్పందించడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించినట్లు తెలిపారు. అలాగే డీఎంహెచ్‌వో అభ్యర్థన మేరకు ఐదు అంబులెన్సులను ప్రత్యేకంగా సిద్ధంగా ఉంచామని మేనేజర్ సురేష్ తెలిపారు.


