బార్ వర్కర్ బలిపశువు..!
కూటమి నేత అల్లుడి కోసమే..?
పందిమెట్టలోని ఓ బార్‌లో
పనిచేసే వ్యక్తి అరెస్ట్
నిందితుడి నుంచి
112 మద్యం బాటిల్స్ స్వాధీనం
బాటిల్‌పై రూ.50 అదనపు వసూళ్లతో
అమ్మకాలు
24 గంటల పాటు
అందుబాటులో మద్యం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం :
సాధారణంగా ఒక బార్‌లో పని చేసుకునే వ్యక్తి కొంటే ఒకటి లేదా రెండు.. మహా అయితే 3 బాటిల్స్ ఒకేసారి కొనుక్కోగలరు. కానీ పోలీసులు అరెస్ట్ చేసిన బార్‌లో పనిచేసే వ్యక్తి ఏకంగా 112 మద్యం బాటిల్స్‌తో దొరికాడు. ఒక్కో బాటిల్‌పై అదనంగా రూ.50 వసూలు చేస్తూ పట్టుబడ్డాడు. తీగ లాగితే కూటమి నేతల డొంక కదులుతుందనే భయంతో.. పోలీసులు సదరు బార్‌లో వర్కర్‌ని బలిపశువుని చేసి రిమాండ్‌కు తరలించారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. స్విగ్గీ జొమాటో బార్‌గా విమర్శలున్న సదరు బార్ అండ్ రెస్టారెంట్ యాజమాన్యంపై ఎలాంటి కేసు పెట్టకుండా చేతులు దులిపేసుకున్నారని సమాచారం. తనిఖీలు చేసేందుకు వెళ్లిన పోలీసులపైనా దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం.. బయటకు రానీయకుండా జాగ్రత్తపడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ మీద ఎలాంటి దురుసు ప్రవర్తన జరగలేదని పోలీసులు చెబుతున్నారు.
పందిమెట్టలోని శివసాయి బార్ అండ్ రెస్టారెంట్‌లో పనిచేసే కనకరాజు అనే వ్యక్తిని మహరాణిపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బాటిల్‌పై రూ.50 వసూలు చేసి.. విక్రయిస్తున్న కనకరాజు నుంచి ఏకంగా 112 మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. మహరాణిపేట పోలీసులు కేసు నమోదు చేసి సదరు వ్యక్తిని రిమాండ్‌కు పంపించారు. ఇదంతా ఒకత్తయితే... ఒక బార్‌లో పనిచేసే వ్యక్తి దగ్గర అన్ని మద్యం బాటిల్స్ ఎలా ఉంటాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే 2021లో ఎకై ్సజ్ శాఖలో పొందుపరిచిన నిబంధనల ప్రకారం ఒక మనిషి 3 బాటిల్స్ మించి కొనడానికి లేదు. నిల్వ చేసుకోడానికి లేదు. అలా చేస్తే అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు ఉంది. అలాంటిది ఒక బార్‌లో పనిచేసే వ్యక్తి ఏ ధైర్యంతో భారీ స్థాయిలో 112 బాటిల్స్‌ని కొనుగోలు చేసి తన దగ్గర ఉంచుకుంటారనేదానిపై పోలీసుల నుంచి సమాధానం లేదు.
ఇది.. స్విగ్గీ జొమాటో బార్..!
నగరంలో మూడు బార్ అండ్ రెస్టారెంట్‌లు స్విగ్గీ జొమాటో బార్‌లుగా పేరొందాయి. అందులో ఈ బార్ కూడా ఉందని సమాచారం. ఈ బార్‌లకు పగలు రాత్రి తేడా లేదు. 24/7 మందు సర్వీసు అందుబాటులో ఉంటుందన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడికి ఎప్పుడు వెళ్లినా.. మద్యం అందుబాటులో ఉంటుంది. అయితే అర్థరాత్రి 12 గంటల తర్వాత వెళ్లిన మద్యం ప్రియుల దగ్గర నుంచి మాత్రం బాటిల్‌పై 50 రూపాయిలు అదనంగా వసూలు చేస్తుంటారు. అందులో భాగంగానే తాజాగా పట్టుబడినట్లు తెలుస్తోంది. అందులో పనిచేసే వ్యక్తికే ఈ బాటిల్స్‌తో సంబంధం ఉందనీ.. అందుకే ఆయన్ని అరెస్టు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. కానీ.. వాస్తవానికి నగరంలోని ఈ మూడు బార్లపై ఇంతవరకూ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడానికి ప్రధాన కారణం.. ఈ స్విగ్గీ జొమాటో బార్ల నుంచి స్థానిక ఎకై ్సజ్ పోలీసులకు, స్థానిక పోలీసులకు నెల వారీ మామ్మూళ్లు అందుతుండటమేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తనిఖీలకు వెళ్లిన పోలీసులపైనా జులుం
కనకరాజుని అదుపులోకి తీసుకున్న సమయంలో బార్ అండ్ రెస్టారెంట్ యాజమాన్యం తనిఖీలకు వెళ్లిన స్థానిక స్టేషన్ ఎస్సై మొహం మీదనే షట్టర్లు మూసేసినట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం నగరంలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్ యజమాని కూడా తనిఖీలకు వెళ్లిన ఎకై ్స్సజ్ సీఐతో దురుసుగా ప్రవర్తించిన సంఘటన మరవకముందే ఇలాంటి సంఘటన మరోసారి చోటు చేసుకుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే అలాంటి సంఘటనలేమీ జరగలేదని మహరాణిపేట సీఐ దివాకర్ యాదవ్ ‘సాక్షి’తో చెబుతుండటం గమనార్హం.
అల్లుడి గిల్లుడుతో గప్‌చుప్
ఈ తతంగం వెనుక బార్ ప్రమేయం లేకుండా ఇన్ని బాటిల్స్ ఒక పనిచేసే వ్యక్తి దగ్గర ఉంటాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ బార్ కూటమి పార్టీలోని కీలక నేత అల్లుడికి చెందిన బార్ కావడమే ఈ వ్యవహారంలో బార్‌పై చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. కేవలం అందులో పనిచేసే వారిపై కేసులు పెట్టి.. బార్ అండ్ రెస్టారెంట్‌ని కేసు నుంచి తప్పించినట్లు సమాచారం. బార్‌లో పనిచేసే వ్యక్తి యాజమాన్యం మద్దతు లేకుండా.. భారీ మొత్తంలో బాటిల్స్ నిల్వ చెయ్యలేరనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బార్ అండ్ రెస్టారెంట్ యాజమాన్యంపై చర్యలు తీసుకోకుండా కూటమి నేతల ఒత్తిళ్లతోనే కేవలం అందులో పనిచేసే వ్యక్తిని బలిపశువు చేశారనే ఆరోపణలున్నాయి.


