కొండవాలు..గుబులు
ఆరిలోవ: తుఫాన్ హెచ్చరికలతో విశాఖ తూర్పు నియోజకవర్గంలోని కొండవాలు ప్రాంతాల వాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సాధారణ వర్షాలకే బితుకుబితుకుమంటూ గడిపే వేల సంఖ్యలో ఉన్న ఈ నివాసితులు, భారీ గాలులు, తుఫాన్ హెచ్చరికలు జారీ కావడంతో మరింత గుబులు పడుతున్నారు. నియోజకవర్గంలో హెచ్‌బీకాలనీ, సింహాద్రిపురం, వెంకోజీపాలెం, హనుమంతవాక, సంజయ్‌గాంధీకాలనీ, సింహగిరికాలనీ, పెదగదిలి, చినగదిలి, బి.ఎన్.ఆర్ నగర్, సుందర్‌నగర్ వంటి పలు కొండవాలు ప్రాంతాలలో వేలకొలది నివాసాలున్నాయి. ఇక్కడ లక్షల సంఖ్యలో ప్రజలు తలదాచుకుంటున్నారు.
వెంటాడుతున్న గత ప్రమాదాలు
వర్షాకాలం వచ్చిందంటేనే ఈ ప్రాంత ప్రజల్లో గుబులు రేగుతుంది. ముఖ్యంగా గతంలో జరిగిన దుర్ఘటనలను వారు గుర్తు చేసుకుంటున్నారు. తుఫాన్ల సమయంలో కొండచరియలు విరిగిపడటం, గోడలు నానిపోయి ఇళ్లు కూలిపోవడం వంటి సంఘటనల్లో ఆస్తి, ప్రాణ నష్టాలు కూడా చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా హుదూద్ తుఫాన్ ధాటికి వందల నివాసాలు నేలమట్టమై, వేలమంది నిరాశ్రయులయ్యారు. ఇలాంటి సంఘటనలు గుర్తుచేసుకుంటూ మొంథా తుఫాన్ ప్రభావం ఎలా ఉంటుందోనని కొండవాలు వాసులు ఆవేదన చెందుతున్నారు.
రక్షణ గోడలు లేక..
జాతీయ రహదారిని ఆనుకొని హనుమంతవాక, వెంకోజీపాలెం, బీఆర్‌టీఎస్‌ను ఆనుకొని సంజయ్‌గాంధీకాలనీ, సింహగిరికాలనీ ప్రాంతాలలో భారీగా నివాసాలున్నాయి. వీటిలో చాలాచోట్ల రక్షణ గోడలు, సరైన మెట్లు మార్గాలు కూడా లేవు. దీంతో వర్షాలకు మట్టి నానిపోయి ఇళ్లను ఆనుకొని కిందకు జారి కూలిపోయే ప్రమాదం ఉంది.
గతంలో సంజయ్‌గాంధీకాలనీలో గోడ కూలి ఓ వృద్ధుడు మృతిచెందడం, హనుమంతవాక వద్ద కొండచరియలు విరిగిపడి రేకుల షెడ్‌లు నేలమట్టమవడం వంటి సంఘటనలు జరిగాయి. ఇలాంటి ప్రమాదాల నేపథ్యంలో, తుఫాన్ హెచ్చరికలు తమలో మరింత భయాందోళనను పెంచుతున్నాయని స్థానికులు వాపోతున్నారు.
కొండవాలు ప్రాంతాల్లో పర్యటన
తుఫాన్ నేపథ్యంలో కొండవాలు ప్రాంతాల ప్రజలను విశాఖ రూరల్ తహసీల్దార్ పాల్ కిరణ్ అప్రమత్తం చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ముందస్తు చర్యల్లో భాగంగా జీవీఎంసీ జోన్–2 జెడ్సీ కె.కనకమహాలక్ష్మి సిబ్బందితో కలిసి హనుమంతవాక, సంజయ్‌గాంధీకాలనీ, పెదగదిలి, చినగదిలి సహా పలు కొండవాలు ప్రాంతాల్లో పర్యటించి, పరిస్థితిని సమీక్షించారు.
పునరావాస ఏర్పాట్లు
తుఫాన్ ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉన్నందున కొండపై భాగంలో ఉన్న నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు. పైనాపిల్‌కాలనీ, శ్రీకృష్ణాపురం, రామకృష్ణాపురం ప్రాంతాల వాసుల కోసం డా. బి.ఆర్. అంబేద్కర్ గురుకులంలో షెల్టర్ ఏర్పాటు చేశారు. పెదగదిలి, హనుమంతవాక, చినగదిలి తదితర కొండవాలు వాసుల కోసం తోటగరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సిద్ధం చేశారు.ప్రమాదం తలెత్తే అవకాశం ఉన్న కొండవాలులోని వారు తమ బంధువులు, తెలిసినవారి ఇళ్లకు ముందుగానే చేరుకోవడం మంచిదని తహశీల్దార్ సూచించారు.


