తీర ప్రాంతాల్లో ముందస్తు చర్యలు
కొమ్మాది/అల్లిపురం: తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో నగర పోలీసులు, జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. తుఫాన్ ప్రభావం అధికంగా ఉంటుందనే వాతావరణ శాఖ ప్రకటన మేరకు సాగరతీరంలోని అన్ని బీచ్‌లను అధికారులు మూసివేశారు. నగరంలో ఆర్కేబీచ్, పామ్‌బీచ్, ఎంవీపీకాలనీ, తెన్నేటి పార్కు, జోడుగుళ్లపాలెం బీచ్‌లతో పాటు సాగర్‌నగర్, రుషికొండ బీచ్‌లను సైతం మూసివేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ప్రకటించారు. సందర్శకులెవరూ బీచ్‌లలోకి ప్రవేశించరాదని ఆదేశించారు.
ఈదురు గాలుల ప్రభావం
మోంథా తుఫాన్ కారణంగా ఆదివారం సాయంత్రం నుంచే ప్రభావం చూపించింది. ఆదివారం రాత్రి ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులు కూడా వీచాయి. సోమ, మంగళవారాల్లో ఈదురు గాలుల వల్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలే ప్రమాదం ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. లైఫ్‌గార్డ్స్, మైరెన్ పోలీసులు, బ్లూ ఫ్లాగ్ సిబ్బంది పర్యాటకులు బీచ్‌లలోకి వెళ్లకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వెనక్కి పంపిస్తున్నారు.
ఆర్‌డీవో పర్యటన,
పునరావాస కేంద్రాల ఏర్పాటు
తుఫాను నేపథ్యంలో తీర ప్రాంతాలైన మంగమారిపేట, చేపలుప్పాడ, తిమ్మాపురం ప్రాంతాలతో పాటు మధురవాడ ప్రాంతాల్లో ఆర్డీవో సంగీత్ మాధుర్ పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు. పునరావాస కేంద్రాలను తక్షణమే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. మత్స్యకారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని, అధికారులు ఇచ్చే సూచనలను పాటించాలని ఆయన సూచించారు.
తీర ప్రాంతాల్లో ముందస్తు చర్యలు
తీర ప్రాంతాల్లో ముందస్తు చర్యలు


