పది తరాలకు గుర్తుండేలా ఏయూ వందేళ్ల పండగ
సీతంపేట: ఆంధ్ర విశ్వకళా పరిషత్ వందేళ్ల పండగను పది తరాలకు గుర్తుండేలా ఏదైనా వినూత్నంగా చేయాలని ఆర్‌జీకేటీయూ పూర్వ వీసీ ప్రొఫెసర్ కె.సి. రెడ్డి పిలుపునిచ్చారు. ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ‘విశాఖ రసజ్ఞవేదిక’ ఆధ్వర్యంలో డాక్టర్ గండికోట రఘురామారావు నేతృత్వంలో ఏయూ శతవసంతాల సందర్భంగా ఆత్మీయ సభ జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన కె.సి. రెడ్డి, ఏయూ విశిష్టతను వివరించారు. సీ.ఆర్. రెడ్డి, సర్వేపల్లి రాధాకృష్ణన్, వాసిరెడ్డి శ్రీకృష్ణ వంటి మహనీయులు ఏయూకు సేవలందించారని గుర్తు చేశారు. ఏయూ చరిత్రను భావి తరాలకు తెలియజేసే బాధ్యత అందరిపై ఉందన్నారు. వందేళ్ల చరిత్రకు గుర్తుగా మంచి భవనం లేదా టవర్ నిర్మాణంతో పాటు, ఏం చేస్తే బాగుంటుందో ఏయూ పాలకవర్గం చొరవ తీసుకుని చర్చించాలని సూచించారు. ఈ సందర్భంగా డాక్టర్ రఘురామారావు మాట్లాడుతూ ఏయూ ఆంధ్రులంతా గర్వించదగిన యూనివర్సిటీ అని, యూనివర్సిటీ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. అనంతరం అతిథుల చేతుల మీదుగా 20 మంది అధ్యాపకులను సత్కరించారు. ఈ సభలో ఏయూ పూర్వ వీసీలు ఆచార్య జి.ఎస్.ఎన్. రాజు, ఆచార్య బీల సత్యనారాయణ, విశాఖ రసజ్ఞ వేదిక కార్యదర్శి ప్రయాగ సుబ్రహ్మణ్యం, మీడగ రామలింగస్వామి, డాక్టర్ ఈదర పెదవీర్రాజు తదితరులు పాల్గొన్నారు.


