పేకాట శిబిరంపై దాడి.. 11 మంది అరెస్ట్
పరవాడ: పెదముషిడివాడ శివారులోని నక్కవానిపాలెం పొలిమేరలో ఈ నెల 21న పేకాట ఆడుతున్న 11 మందిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.19.20 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు పరవాడ డీఎస్పీ వి.విష్ణు స్వరూప్ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. నక్కవానిపాలెం గ్రామ పొలిమేరల్లో ఒక రహస్య ప్రదేశంలో పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు సీఐ ఆర్.మల్లికార్జునరావు తన సిబ్బందితో కలిసి ఈ నెల 21న రాత్రి 9 గంటల సమయంలో శిబిరంపై దాడి చేశారు. అక్కడ పేకాట ఆడుతున్న జెర్రిపోతుల శివ(డొంకాడ కాలనీ), కె. నాగఅప్పలరాజు (సిహెచ్ అగ్రహారం), చింతల అప్పారావు (మల్కాపురం దరి త్రినాథపురం), గాలి రమేష్ కుమార్ (అప్పికొండ కాలనీ), జి. బాలాజీ (దువ్వపాలెం), కర్రి శివప్రసాద్ (యలమంచిలి), పోలవరపు సుధాకర్(అనకాపల్లి), కర్రి అప్పారావు(అసకపల్లి), కర్రి నేతాజీ (గాజువాక), కె.నాగేశ్వరరావు (రాంబిల్లి మండలం కొత్తూరు), టి. శ్రీనివాసరావు(అనకాపల్లి)లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మొత్తం రూ.19.20 లక్షల నగదు, 17 మొబైల్ ఫోన్లు, 2 బైక్‌లు, ఒక కారు, పేక ముక్కలు, చార్జింగ్ లైట్లు, టార్పాలిన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో నలుగురు పరారీలో ఉన్నారని, వారి కోసం దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు. దాడిలో పాల్గొన్న పోలీస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.


