పశు సంవర్ధక శాఖ ఏడీ ప్రసాద్‌కు రైతునేస్తం అవార్డు
మహారాణిపేట: పద్మశ్రీ ఐవీ సుబ్బారావు రైతు నేస్తం పురస్కారానికి డాక్టర్ మాదిన ప్రసాదరావును ఎంపిక చేసినట్టు రైతు నేస్తం చైర్మన్ పద్మశ్రీ యడ్లపల్లి వెంకటేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పురస్కారాన్ని ఈ నెల 26న హైదరాబాద్‌లోని స్వర్ణభారత్ ట్రస్ట్‌లో రైతు నేస్తం, ముప్పవరపు ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జరగనున్న కార్యక్రమంలో పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అందిస్తారని పేర్కొన్నారు. ప్రసాదరావు విశాఖలో పశు సంవర్థక శాఖలో సహాయ సంచాలకునిగా పనిచేస్తున్నారు. పశు సంవర్ధక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి రైతుల్లో అవగాహన పెంచేలా విశేష సేవలు అందించారు. 31 ఏళ్లుగా మూగ జీవాలకు సేవలు అందిస్తూనే రైతులకు, పశు వైద్య సిబ్బందికి ప్రయోగాత్మక శిక్షణ ఇచ్చేందుకు పలు లఘు చిత్రాలను, 300 పైగా వీడియోలను రూపొందించారు. మాదినకు రైతునేస్తం పురస్కారం ప్రకటించడం పట్ల రాష్ట్ర పశు సంవర్థక శాఖ డైరెక్టర్ డాక్టర్ దామోదర్ నాయుడు, అదనపు డైరెక్టర్ డాక్టర్ ఎండ సింహాచలం, విశాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ డాక్టర్ శంకరరావు, ఉప సంచాలకులు డాక్టర్ చంద్రశేఖర్ హర్షం వ్యక్తం చేశారు.


