తమ్ముడిని రాడ్‌తో కొట్టి చంపిన అన్న
పెదగంట్యాడ: మండలంలోని వికాస్‌నగర్‌లో అన్న చేతిలో తమ్ముడు దారుణంగా హత్యకు గురయ్యాడు. బైక్ వేగంగా నడపడంపై జరిగిన గొడవ ఈ హత్యకు దారి తీసింది. న్యూ పోర్ట్ పోలీసులు తెలిపిన వివరాలివి. వికాస్‌నగర్ నివాసి అయిన కరణం తిరుపతిరావుకు నాగరాజు, గోవింద్, శేఖర్ అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. వీరికి ఇంకా వివాహం కాలేదు. వీరిలో పెద్ద కుమారుడు నాగరాజు నేవల్ డాక్‌యార్డ్‌లో షిప్ బిల్డింగ్‌లో ఫిట్టర్‌గా పనిచేస్తుండగా, మూడో కుమారుడు శేఖర్ బైక్ మెకానిక్ షెడ్‌ను నిర్వహిస్తున్నాడు. ఇటీవల శేఖర్ బైక్‌ను వేగంగా నడుపుతున్నాడని నాగరాజుకు ఒక స్నేహితుడు చెప్పాడు. దీంతో ఆగ్రహించిన నాగరాజు.. శేఖర్‌కు ఫోన్ చేసి మందలించాడు. కాగా.. దీపావళి సందర్భంగా టపాసులు కొనుగోలు చేసేందుకు వెళ్లిన నాగరాజుకు శేఖర్ ఫోన్ చేసి దుర్భాషలాడాడు. అనంతరం శేఖర్ నిర్వహిస్తున్న మెకానిక్ షెడ్డు వద్దకు నాగరాజు వచ్చి మళ్లీ తమ్ముడిని మందలించే ప్రయత్నం చేయగా.. శేఖర్ ఎదురు తిరిగాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగి ఒకరినొకరు తోసుకునే వరకు వచ్చింది. అక్కడ ఉన్న శేఖర్ స్నేహితుడు వారిని వారించేందుకు ప్రయత్నించినా గొడవ ఆగలేదు. ఈ క్రమంలో మెకానిక్ షెడ్డులో ఉన్న ఒక రాడ్‌తో నాగరాజు తమ్ముడు శేఖర్ తలపై బలంగా కొట్టాడు. తీవ్రంగా గాయపడిన శేఖర్‌ను వెంటనే అగనంపూడి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందించిన తరువాత మెరుగైన చికిత్స కోసం కేజీహెచ్‌కు తరలించారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ శేఖర్ మంగళవారం మృతి చెందాడు. మృతుడి తండ్రి తిరుపతిరావు ఫిర్యాదు మేరకు న్యూ పోర్ట్ సీఐ కామేశ్వరరావు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


