వలస కుటుంబాల్లో తీరని వేదన
ఈ ప్రమాదం ఉపాధి కోసం సుదూర ప్రాంతాల నుంచి నగరానికి వలస వచ్చిన రెండు నిరుపేద కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. మృతుడు అజయ్ కుమార్ స్వస్థలం చీడికాడ మండలం వరహాపురం గ్రామం. అతని తండ్రి అర్జున్ ఇటీవల కుటుంబాన్ని వదిలి వెళ్లిపోవడంతో, తల్లి లోవలక్ష్మితో కలిసి 87వ వార్డు కాశీపాలెంలో ఒక అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మన్‌గా పని చేస్తున్నాడు. తల్లి కష్టాన్ని చూసిన అజయ్ ఐటీఐ చదువుతూనే, మరోవైపు కోళ్ల వ్యానులో పనిచేస్తూ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుస్తున్నాడు. తన చెల్లి ఐశ్వర్యను ఇంటర్ చదివిస్తున్నాడు. కొడుకు ప్రయోజకుడై తమ కష్టాలు తీరుస్తాడనుకున్న ఆ తల్లికి.. అజయ్ మరణం తీరని పుత్రశోకాన్ని మిగిల్చింది. మరో మృతుడు వెందుర్తి మనోజ్ కుమార్ కుటుంబానిది కూడా ఇలాంటి దీన గాథే. ఏడేళ్ల కిందట విజయనగరం జిల్లా గంట్యాడ మండలం బోనంగి నుంచి ఉపాధి కోసం నగరానికి వలస వచ్చారు. అతని తల్లిదండ్రులు ముత్యాలు, దేముడమ్మ.. కూర్మన్నపాలెం 86వ వార్డు అశోకనగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నారు. మనోజ్ కుమార్ ఐటీఐ మధ్యలో ఆపేసినట్టు పోలీసులు తెలిపారు. మనోజ్‌కు కూడా ఒక చెల్లి ఉంది. కొడుకు మరణవార్త విని తల్లి దేముడమ్మ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తీరు అక్కడున్నవారిని కంటతడి పెట్టించింది. గంటల ముందు తమ కళ్లెదుట దీపావళి సంబరాల్లో పాల్గొన్న పిల్లలు.. ఒక్కసారిగా విగతజీవులుగా మారడంతో ఆ తల్లిదండ్రులు, బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. వారి రోదనలతో కూర్మన్నపాలెం ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


