‘రియల్ హీరోస్‌కి మా వందనం’ బుక్‌లెట్ల ఆవిష్కరణ
విశాఖ సిటీ: పోలీస్ అమరవీరులకు నివాళిగా ‘రియల్ హీరోస్‌కి మా వందనం’ పేరుతో రచించిన శౌర్యం, స్మృతి తెలుగు, ఆంగ్ల బుక్‌లెట్లను పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తన చాంబర్‌లో మంగళవారం ఆవిష్కరించారు. అమరులైన పోలీసుల ధైర్య సాహసాలు, త్యాగాలు అనితర సాధ్యమైనవని పేర్కొన్నారు. యువతరానికి స్ఫూర్తిగా నిలుస్తూ అనేక స్వచ్ఛంద, సామాజిక సేవా చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్న యూనివర్సల్ యూత్ వాకర్స్ బృందాన్ని, వాకర్స్ ఇంటర్నేషనల్ యూత్ చైర్‌పర్సన్ వంశీ చింతలపాటిని అభినందించారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరులకు ఈ శౌర్యం, స్మృతి బుక్‌లెట్లను అంకితం చేస్తున్నట్లు చైర్‌పర్సన్ వంశీ చెప్పారు. ఈ బుక్‌లెట్లను ద్రోణ కన్సల్టీ అధినేత సురేష్ బేత రచించారని యూత్ సమన్వయకర్త లికిత్‌బేత తెలిపారు. కార్యక్రమంలో యూత్ వాకర్స్ కార్యదర్శి పి.శ్రీనివాస్ పాల్గొన్నారు.


