పచ్చ పాతమే.. | - | Sakshi
Sakshi News home page

పచ్చ పాతమే..

Oct 20 2025 7:21 AM | Updated on Oct 20 2025 7:21 AM

పచ్చ

పచ్చ పాతమే..

మొదటి వరుస షాపులన్నీ కూటమి కార్యకర్తలకే కొనుగోలుదారులకు కనిపించే దుకాణాలు కూటమికి కేటాయింపు టీడీపీ, జనసేనకి తలొగ్గిన అధికారులు ఎమ్మెల్యేలు చెప్పిన అసోసియేషన్లకే కేటాయింపులు బేరాలు రాని దుకాణాలు ఇతర వర్తకులకు

స్టాళ్ల కేటాయింపులోనూ

సాక్షి, విశాఖపట్నం:

2, 5, 7, 12, 12ఏ, 13, 14, 15, 16...

ఈ నంబర్లు చూసి.. ఐఐటీ, ఎంసెట్‌, నీట్‌ ర్యాంకులు అనుకుంటే పొరపాటే..

అధికారాన్ని పక్కన పెట్టేసి.. ప్రభుత్వ పార్టీలకు తలొగ్గి.. ‘పచ్చ’పాతంతో కూటమి నేతల అనుచరులకు అధికారులు కేటాయించిన దీపావళి స్టాల్స్‌ నంబర్లివి. చెప్పుకుంటే.. చాంతాండంత లిస్టు ఉంది. అసలు స్టాల్స్‌ కేటాయింపుల్లో నంబర్ల గోలేమిటంటే..!

దీపావళి సామాగ్రిని విక్రయించేందుకు ఏటా రిటైల్‌ స్టాల్స్‌ని నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు. ముఖ్యంగా ఏయూ గ్రౌండ్స్‌, ఏఎస్‌ రాజా మైదానం, షీలానగర్‌, గాజువాక మొదలైన ప్రాంతాల్లో స్టాల్స్‌ ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం అనుమతులు మంజూరు చేస్తుంటుంది. ఈసారి అనుమతుల విషయంలో గందరగోళం నెలకొంది. వందల మంది దరఖాస్తులు చేసుకున్నా.. కూటమినేతలు చెప్పిన వారికే అనుమతులు ముందస్తుగా ఇచ్చేసి.. సాధారణ వ్యాపారులకు ఆదివారం రాత్రి వరకూ పర్మిషన్లు ఇవ్వలేదు. ఎప్పటిలాగానే దరఖాస్తు చేసుకున్న వ్యాపారులు.. లాటరీ పద్ధతిద్వారా తమకు స్టాల్స్‌ కేటాయించేస్తారనే ఉద్దేశంతో స్టాల్స్‌ ఏర్పాటు చేసుకున్నారు. వీరిపై అధికారులు జులుం ప్రదర్శించి.. అనుమతులు మంజూరు చెయ్యకుండానే స్టాల్స్‌ ఏర్పాటు చేశారంటూ ఫైన్లు వేసేశారు. కొందరికి మాత్రమే అనుమతులు వచ్చాయి. కారణం.. వారంతా కూటమి నేతలు సిఫార్సు చేసిన వారు కాబట్టి..

ఎమ్మెల్యేల అసోసియేషన్లకే జై..!

సాధారణంగా.. స్టాల్స్‌ ఏర్పాటుకు సంబంధించిన అనుమతులే ఓ గాంబ్లింగ్‌గా మారింది. కొందరు వర్తకులు కలిసి ఒక అసోసియేషన్‌గా ఏర్పాటై.. ఇన్ని స్టాల్స్‌ కావాలంటూ దరఖాస్తు చేసుకుంటారు. అన్ని విభాగాల్ని ప్రసన్నం చేసుకుంటేనే పర్మిషన్లు వెంటనే మంజూరైపోతాయి. కానీ ఈసారి మాత్రం కూటమి ఎమ్మెల్యేలే చక్రం తిప్పేశారు. తమ పార్టీలకు చెందిన అనుచరులు, వ్యాపారులతో అసోసియేషన్లు ఏర్పాటు చేసి.. ఆ జాబితాల్నే అధికారులకు పంపించారు. వాటికే అధికారులు ఓకే చెప్పారు.

సాధారణంగా ఎప్పటిమాదిరిగా ఉన్న అసోసియేషన్ల జాబితాల్ని పక్కనపెట్టేశారు. దీంతో వారంతా అయోమయంలో పడ్డారు. మరోవైపు కూటమి నేతలు ఇచ్చిన అసోసియేషన్లలోనూ పచ్చపాతంతో వ్యవహరించారు. కొందరు వ్యాపారుల్ని వారి జాబితాలో చేర్చారు. కానీ వారికి చివరి స్టాళ్లు కేటాయింపులు చేసి.. ప్రధానమైనవి, ప్రజలు వచ్చిన వెంటనే కనిపించే స్థానాల్లో ఉన్న స్టాల్స్‌ మొత్తం కూటమి నేతలు తమ అనుచరులకు కేటాయించారు. దీంతో.. పచ్చ లిస్టులోని స్టాల్స్‌కే వ్యాపారాలు సాగుతున్నాయి. మిగిలిన వారు మాత్రం.. తమకు బేరాలు రావట్లేదంటూ లబోదిబోమంటున్నారు. మొత్తంగా.. మతాబుల వెలుగుల్లో జరగాల్సిన దీపావళి పండగ.. కూటమి నేతల మతలబులతో అయోమయంగా మారింది. అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు కూడా పచ్చ నేతలకే జై కొట్టి.. మమా అనిపించారంటూ వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

పచ్చ పాతమే..1
1/1

పచ్చ పాతమే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement