ఏఎంసీలో మరో 8 పీజీ సీట్ల పెంపునకు గ్రీన్ సిగ్నల్
మహారాణిపేట: ఆంధ్ర వైద్య కళాశాలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లను మరో 8 పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. దీంతో ప్రస్తుతం ఉన్న పీజీ సీట్ల సంఖ్య 368 నుంచి 376కు చేరుకుంది. ఈ కొత్తగా పెరిగిన 8 సీట్లలో, పీడియాట్రిక్స్‌లో నాలుగు సీట్లు, ఎమెర్జెన్సీ మెడిసిన్‌లో తొలిసారిగా నాలుగు పీజీ సీట్లు మంజూరయ్యాయి.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్ర వైద్య కళాశాలకు చెందిన 27 వైద్య విభాగాల్లో 131 పీజీ సీట్లు పెరిగాయి. అంతకుముందు 38 వైద్య విభాగాల్లో 237 సీట్లు ఉండగా, ఈ 131 సీట్లు కలపడం ద్వారా మొత్తం సీట్ల సంఖ్య 368కి చేరుకుంది. ఇప్పుడు అదనంగా పెరిగిన ఈ 8 సీట్లతో కలిపి, ఏఎంసీలో మొత్తం పీజీ సీట్ల సంఖ్య 376కు పెరిగింది. పెరిగిన సీట్ల సంఖ్య పట్ల వైద్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం ఆంధ్రా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యాదేవిని కలిసి, డాక్టర్ చక్రవర్తి, రాజేంద్రప్రసాద్, నవీన్ తదితర వైద్యులు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
భర్తీకి ఏర్పాట్లు : పెరిగిన ఈ సీట్లను త్వరలో అడ్మిషన్ల ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించేందుకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ, వైద్య ఆరోగ్య శాఖ కసరత్తు చేస్తున్నాయి. దీనికి అనుగుణంగా ఆంధ్ర వైద్య కళాశాల కూడా ఏర్పాట్లు చేస్తోంది.
సీట్లు పెరగడం చాలా సంతోషంగా ఉందని, అందరి సహకారం వల్లే ఇది సాధ్యమైందని ఏఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యాదేవి తెలిపారు.


