సొంత గనులతోనే విశాఖ ఉక్కు మనుగడ సాధ్యం
ఉక్కునగరం: విశాఖ ఉక్కు కర్మాగారం మనుగడ సాగించాలంటే సొంత గనులు తప్పనిసరి అని స్టీల్ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి లలిత్ మిశ్రా స్పష్టం చేశారు. ఆదివారం ఉక్కునగరంలోని గురజాడ కళాక్షేత్రంలో జరిగిన స్టీల్ ప్లాంట్ సీఐటీయూ 12వ మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ పరిశ్రమలు, కార్మికుల పట్ల అవలంబిస్తున్న నిరంకుశ విధానాలను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసే ప్రయత్నంలో భాగంగానే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ‘నేషనల్ పైప్‌లైన్’ పేరుతో 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి, 12–13 గంటల పని విధానాన్ని బలవంతంగా అమలు చేస్తోందని విమర్శించారు.
కర్మాగార పరిరక్షణ, కార్మిక హక్కుల కోసం ఉద్యమాలను మరింత ఉధృతం చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా లలిత్ మిశ్రా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్. నర్శింగరావు, ఎన్. రామారావు, సీపీఎం నాయకులు ఎం. జగ్గునాయుడు తదితరులు పాల్గొన్నారు.


