బంగారు భవిష్యత్‌కు చదువే మూలం
ఆరిలోవ: ఆడ బిడ్డలను ఇంటికే పరిమితం చేయకుండా.. తప్పకుండా చదివించాలని తల్లిదండ్రులకు కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ సూచించారు. అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం తోటగరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. జిల్లాలో అన్ని మండలాల నుంచి ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న బాలికలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు పాటుపడతామని బాలికలతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆడ బిడ్డలు బంగారం లాంటివారన్నారు. వారిని ఉన్నత చదువులు చదువుకోవడానికి తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు. కలలు సాధనకు, బంగారు భవిష్యత్‌కు చదువే మూలమన్నారు. బాలికలు క్రమశిక్షణ, పట్టుదలతో ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు. బాలికలకు ఎలాంటి సమస్యలు వచ్చినా టోల్‌ప్రీ నంబర్ 1098కు ఫోన్ చేయాలని సూచించారు. అనంతరం ప్రపంచ బాలికల దినోత్సవం సందర్భంగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పాఠశాలల్లో బాలికలకు జరిపిన వ్యాసరచన, క్విజ్ తదితర పోటీల్లో విజేతలకు కలెక్టర్ హరేందిర ప్రసాద్, డీఈవో ఎన్.ప్రేమకుమార్, ఐసీడీఎస్ పీడీ రామలక్ష్మితో కలసి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సమగ్రశిక్ష ఏపీసీ చంద్రశేఖర్, డిప్యూటీ డీఈవో, ఎంఈవోలు రవీంద్రబాబు, అనురాధ, పాఠశాల హెచ్‌ఎం, ఉపాధ్యాయులు, ఐసీడీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.


