వక్ఫ్ రికార్డుల కంప్యూటరీకరణపై దిశానిర్దేశం
సీతంపేట: ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డ్ రికార్డుల కంప్యూటరీకరణపై ఓరియెంటేషన్ కార్యక్రమాలు నిర్వహించినట్లు వక్ఫ్ బోర్డ్ సీఈవో షేక్ మహమ్మద్ ఆలీ అన్నారు. అక్కయ్యపాలెంలోని మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ కమ్యూనిటీ హాల్‌లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి ఎన్.మహమ్మద్ ఫరూఖ్ ఆదేశాల మేరకు.. ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన ముతవల్లీ(కమిటీ)లు, నిర్వహణ కమిటీల కోసం వక్ఫ్ రికార్డుల కంప్యూటరీకరణపై దిశానిర్దేశం చేశామన్నారు. వక్ఫ్ రికార్డులు, ఆస్తులు, ఆదాయం నిర్వహణలో పారదర్శకతను పెంచడంతో పాటు, మిగిలిన ఆదాయాన్ని ముస్లిం సమాజ సంక్షేమం కోసం ఎలా ఉపయోగించాలో ముతవల్లీలకు వివరించినట్లు చెప్పారు. ఆన్‌లైన్ పోర్టల్‌లో సమాచారాన్ని అప్‌లోడ్ చేసే సమయంలో డీఆర్వో, జిల్లా మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ సహాయం తీసుకోవాలని సూచించామన్నారు. మిగులు ఆదాయాన్ని పేద, నిరుపేద ముస్లిం మహిళలు, వితంతువుల కోసం వినియోగించాలని నిర్ణయించామని, ఈ నిధులతో ‘ఖాలీమే హున్నర్’ అనే ఒక సంప్రదాయ నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రతిపాదించినట్లు వివరించారు. ఇందులో భాగంగా విశాఖలోని హజరత్ ఇషాక్ ఆలీ మదీనా దర్గా దగ్గర ఉన్న భవనంలో శిక్షణ పొందిన వారికి ఒక కుట్టు మిషన్, సర్టిఫికెట్ అందజేస్తామన్నారు. గౌరవ సభ్యులు డాక్టర్ రఫియా, ముకర్రం ముజీబి తదితరులు పాల్గొన్నారు.
వక్ఫ్ రికార్డుల కంప్యూటరీకరణపై దిశానిర్దేశం


