ఏయూక్యాంపస్: స్వచ్ఛత మానవ జీవితంలో అంతర్భాగం కావాలని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి.సూర్యప్రకాశరావు అన్నారు. ఆదాయపు పన్ను శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం బీచ్ రోడ్డులో నిర్వహించిన స్వచ్ఛత 5.0 కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ముందుగా కాళీమాత ఆలయం నుంచి చేసిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించి, కోకో ఎరీనా వద్ద నిర్వహించిన బీచ్ క్లీనింగ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూర్యప్రకాశరావు మాట్లాడుతూ స్వచ్ఛత ప్రాధాన్యం దేశం తెలుసుకుందని, ఈ దిశగా ప్రతి వ్యక్తి అడుగులు వేస్తున్నారన్నారు. ఆదాయపు పన్ను శాఖ–1 ప్రిన్సిపల్ కమిషనర్ బి.శ్రీనివాస్ మాట్లాడుతూ స్వచ్ఛత ప్రాధాన్యం, పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను తెలుసుకోవాలన్నారు. తడి, పొడి వ్యర్థాలను వేరుచేయడం, సక్రమంగా నిర్వహించడం ఎంతో అవసరమన్నారు. స్వచ్ఛత ప్రాముఖ్యతను ప్రజలకు చాటే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ఈ ఆఫీస్, వ్యర్థాల విభజన, పన్ను చెల్లింపుదారులు, ఉద్యోగుల్లో అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న విధానాన్ని వివరించారు. కార్యక్రమంలో ఆదాయ పన్ను(అపీల్స్)–3 కమిషనర్ సత్యసాయి రథ్, ఆదాయ పన్ను శాఖ అధికారులు పాల్గొన్నారు.


