గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో చోరీ కేసు ఛేదన
రూ. 7 లక్షల విలువైన బంగారు నగలు, మొబైల్ రికవరీ
తాటిచెట్లపాలెం: రైలులో చోరీకి గురైన బంగారు ఆభరణాలను గుర్తించి, దొంగతనానికి పాల్పడిన మైనర్‌ను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గవర్నమెంట్ రైల్వే పోలీసులు తెలిపిన వివరాలివి. ఈ నెల 14న హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వచ్చే గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న చిగురువలసకు చెందిన అట్లూరి హేమకుమారి బంగారు నగలు చోరీకి గురయ్యాయి. దీనిపై బాధితులు విశాఖపట్నం గవర్నమెంట్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. జీఆర్పీ సీఐ సిహెచ్.ధనుంజయ నాయుడు ఆధ్వర్యంలో ఎస్‌ఐ కేటీఆర్ లక్ష్మి, సిబ్బంది ఎల్. ఉదయ్‌భాస్కర్, జి. దుర్గాప్రసాద్, ఎం.రాజేష్‌లతో కూడిన బృందం ఈ కేసును దర్యాప్తు చేపట్టింది. రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న మైనర్‌కు ఈ చోరీలో సంబంధం ఉన్నట్లు గుర్తించి, అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి సుమారు రూ.7లక్షల విలువైన చోరీ సొత్తును పోలీసులు రికవరీ చేశారు. ఇందులో రెండు వరుసల బంగారు చంద్రమాల(24 గ్రాములు), బంగారు నల్లపూసల గొలుసు(17.24 గ్రాములు), లాకెట్ ఉన్న బంగారు గొలుసు(17.068 గ్రాములు), ఒక శాంసంగ్ మొబైల్ ఫోన్ ఉన్నాయి. మైనర్‌ను జువైనెల్ హోమ్‌కు పంపించినట్లు జీఆర్పీ సిబ్బంది తెలిపారు.


