గల్లంతైన శ్రీను మృతదేహం లభ్యం
మూలకుద్దు వద్ద శ్రీను మృతదేహం లభ్యం
తగరపువలస: జీవీఎంసీ భీమిలి జోన్, ఒకటో వార్డులోని బాలాజీనగర్ వద్ద గోస్తనీ నదిలో మంగళవారం స్నానానికి దిగి గల్లంతైన తమ్మిన శ్రీను (36) మృతదేహం శుక్రవారం మూలకుద్దు తీరంలో లభించింది. శ్రీను ఆచూకీ కోసం మూడు రోజులుగా భీమిలి పోలీసులు, తాళ్లవలస అగ్నిమాపక సిబ్బంది, బంధువులు, మత్స్యకారులు, ఏపీఎస్‌డీఆర్‌ఎఫ్ బృందం టి.నగరపాలెం, తగరపువలస ప్రాంతాల్లోని గోస్తనీ నదిలో గాలించారు. కాగా.. శుక్రవారం శ్రీను మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం బాలాజీనగర్ శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు. శ్రీనుకు భార్య సుగుణతో పాటు 10, 12 ఏళ్ల వయసు గల ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ నెల 13న మృతుడి బావ పీసా త్రిమూర్తులు ఆత్మహత్య చేసుకున్నారు. 14న జరిగిన ఆయన అంత్యక్రియల అనంతరం, శ్రీను నదిలో స్నానానికి దిగి గల్లంతైన సంగతి తెలిసిందే. కేవలం రెండు రోజుల వ్యవధిలో బాలాజీనగర్‌కు చెందిన బంధువులు ఇద్దరు మృతి చెందడంతో స్థానికంగా విషాదం నెలకొంది. ఈ రెండు సంఘటనలకు సంబంధించి భీమిలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


