
సీనియర్ల సారథ్యం.. యువోత్సాహం
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్ర ప్రీమియర్ లీగ్(ఏపీఎల్)లో ఆటగాళ్ల వేలం ముగిసింది. నాలుగో సీజన్ కాస్త ఆలస్యమైనా.. ఆగస్టు 8 నుంచి 23 వరకు అట్టహాసంగా ప్రారంభం కానుంది. అన్ని మ్యాచ్‌లకు నగరంలోని వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేడియం వేదిక కానుంది. ఈ టోర్నీలో మొత్తం 25 మ్యాచ్‌లు (4 ప్లేఆఫ్‌లతో కలిపి) జరగనున్నాయి. ఏపీఎల్ కేవలం అభిమానులను ఉత్సాహపరచడమే కాకుండా.. ఎందరో యువ ఆటగాళ్లకు ఐపీఎల్ లాంటి మెగా టోర్నీల్లో తలుపు తట్టే సువర్ణావకాశం కల్పించనుంది. వేలానికి ముందే ఏడు ఫ్రాంచైజీలు తమ కెప్టెన్లను ఎంచుకోగా.. మిగిలిన ఆటగాళ్ల కోసం వేలం జరిగింది. మొత్తం 520 మంది ఆటగాళ్లలో 135 మందిని ఫ్రాంచైజీలు దక్కించుకున్నాయి.
విశాఖ ఆటగాళ్ల హవా..
ఈ సీజన్‌లో జట్లకు నాయకత్వం వహించనున్న వారిలో విశాఖ ఆటగాళ్ల హవా కనిపిస్తోంది. సింహాద్రి వైజాగ్ లయన్స్‌కు రిటైన్ చేసుకున్న ఆటగాళ్లలో అత్యధిక ధర పలికిన రికీ భుయ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. భీమవరం బుల్స్‌ను నితీష్ కుమార్ రెడ్డి, అందుబాటులో లేకపోతే సత్యనారాయణ రాజు నడిపిస్తాడు. కాకినాడ కింగ్స్‌కు డిఫెండింగ్ కెప్టెన్, వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ తన బాధ్యతలను కొనసాగించనున్నాడు. రాయల్స్ రాయలసీమ విశాఖకే చెందిన అవినాష్‌ను వేలంలో అత్యధిక ధరకు దక్కించుకుంది. అయితే కెప్టెన్సీని రిటైన్ చేసుకున్న రషీద్‌కు ఇస్తారా లేక అవినాష్‌కు అప్పగిస్తారా అనేది తేలాల్సి ఉంది. స్టార్ బ్యాటర్ హనుమ విహారి తిరిగి ఏపీఎల్‌లోకి వచ్చాడు. అమరావతి రాయల్స్ జట్టును నడిపించనున్నాడు. విజయవాడ సన్‌షైనర్స్‌కు గత సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన అశ్విన్ హెబ్బర్ నాయకత్వం వహించనున్నాడు. తుంగభద్ర వారియర్స్ కెప్టెన్సీ విశాఖకే చెందిన శశికాంత్ లేదా స్టీఫెన్లలో ఒకరికి దక్కే అవకాశం ఉంది.
యువతపైనే అందరి దృష్టి
ఈసారి ఏపీఎల్‌లో యువ ఆటగాళ్లపై ప్రత్యేక దృష్టి నెలకొంది. ప్రతి జట్టులో ఇద్దరు అండర్–19 ఆటగాళ్లు ఉండాలనే నిబంధనతో ఫ్రాంచైజీలు యువ ప్రతిభకు పట్టం కట్టాయి. వారియర్స్ జట్టు ఏకంగా ఆరుగురు అండర్–19 ఆటగాళ్లను కొనుగోలు చేసి పెద్ద ప్రయోగానికే సిద్ధమైంది. బీ గ్రేడ్‌లో బేస్ ప్రైజ్ రూ.60 వేలు, సీ గ్రేడ్‌లో రూ.30వేలుగా నిర్ణయించగా.. వేలంలో కొందరు యువ ఆల్‌రౌండర్లు ఊహించని ధర పలికారు. వీరారెడ్డి (అనంతపురం)ని లయన్స్ జట్టు ఏకంగా రూ. 4.20 లక్షలకు కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇటీవల అంతర్ జిల్లాల టోర్నీలో వీరారెడ్డి 86.80 స్టయిక్‌రేట్‌తో 592 పరుగులు చేశాడు. 3.56 ఎకానమీతో 10 వికెట్లు, 8 స్టంపింగ్‌లతో అద్భుత ప్రదర్శన చేశాడు. ఆర్దిత్ (కడప)ను వారియర్స్ జట్టు రూ. లక్షకు దక్కించుకుంది. ఆర్దిత్ 332 పరుగులు, 14 వికెట్లతో సత్తా చాటాడు. జయచంద్ర కేశవ్ (గుంటూరు)ను కూడా వారియర్స్ జట్టే రూ. 90 వేలకు కొనుగోలు చేసింది. కేశవ్ 158.43 స్ట్రైక్ రేట్‌తో 282 పరుగులు చేసి తన దూకుడును ప్రదర్శించాడు. వీరే కాక ప్రద్నీష్, బస్వాంత్, విష్ణుదత్త, భార్గవ్, నాగవినయ్, ధీరజ్, మనోజ్, దుర్గేశ్, రామ్‌కుమార్, ఈశ్వర్, హర్షసాయి, ఆనంద్, ఆకాష్, శ్రీదత్త, తోషిత్ వంటి ఎందరో అండర్–19 ఆటగాళ్లు జట్లకు ఎంపికయ్యారు. అయితే వీరిలో తుది జట్టులో ఎంతమందికి అవకాశం దొరుకుతుందో చూడాలి. అయితే అంతర్ జిల్లాల టోర్నీలో అద్భుతంగా రాణించిన వరుణ్ సాయి (26 వికెట్లు), ప్రణీత్, మన్విత్ (500కి పైగా పరుగులు) వంటి ఆటగాళ్లను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయకపోవడం గమనార్హం. మొత్తం మీద జట్ల ఎంపిక పూర్తి కావడంతో ఇప్పుడు అందరి దృష్టి టైటిల్‌పైనే ఉంది. అనుభవజ్ఞులైన కెప్టెన్లు, ఉత్సాహవంతులైన యువ ఆటగాళ్లతో ఈ నాలుగో సీజన్ ఎలాంటి సంచలనాలకు వేదిక అవుతుందో వేచి చూడాలి.
వచ్చే నెల 8 నుంచి ఏపీఎల్ హోరు
అందరి చూపు విశాఖ క్రికెటర్ల వైపే..