
రేవళ్లపాలెం భూకబ్జా వ్యవహారంలో కూటమి ఎమ్మెల్యేదే కీలకపా
వ్యవహారం నడిచిందిలా...!
మధురవాడ రేవళ్లపాలెంలోని సర్వే నెంబరు 203/14ఏ పార్టు బ్యాంక్ ఆఫీసర్స్ హౌసింగ్ లే అవుట్ ఉంది. ఈ లే–అవుట్‌లో అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన ఆర్‌ఎస్‌ఎస్ ప్రకాశ్‌రావుతో పాటు మరి కొందరు 300 గజాల చొప్పున ప్లాట్లను కొనుగోలు చేశారు. ఇందులో కొందరు మరణించగా మరికొందరు విదేశాల్లో స్థిరపడిపోయారు. దీనిని అదునుగా తీసుకుని రేవల్లపాలెంకు చెందిన బెవర అనిల్‌కుమార్, వెంకటేష్‌తో పాటు శ్రీకాకుళం జిల్లాకు చెందిన పగోటి దిలీప్‌కుమార్ తదితరులు తప్పుడు డాక్యుమెంట్లను సృష్టించారు. తమ తాత, ముత్తాతల నుంచి వచ్చిన స్థలమంటూ తప్పుడు అడంగల్, ఎఫ్‌ఎంబీలను సృష్టించి పేర్లు చేర్చుకున్నారు. 1,572.66 గజాలకు జీపీఏ, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ (దస్తావేజు నెంబరు 5585/2025) కూడా చేయించుకున్నారు. తన స్థలంలో ఎవరో దౌర్జన్యంగా పొక్లెయిన్లను ఉపయోగించి ఫెన్సింగ్ వేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ప్రకాశ్‌రావు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. పోలీసులు విచారణ జరిపి భూఅక్రమార్కులను ఇటీవల అరెస్టు చేశారు. కాగా కాకినాడకు చెందిన ఉసిరికాల రాజా రామ పద్మజ అనే మహిళ పేరిట స్థలం రిజిస్ట్రేషన్ జరిగింది. ఇందుకోసం ఆమె రూ.3.97 కోట్లు కూడా చెల్లించినట్టు రిజిస్ట్రేషన్ డాక్యుమెంటులో పేర్కొన్నారు.
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం :
కూటమి నేతల భూదాహం హద్దులు దాటుతోంది. మధురవాడ రేవళ్లపాలెం భూ కబ్జా వ్యవహారంలో కూటమి ఎమ్మెల్యేదే కీలకపాత్ర ఉన్నట్టు తెలుస్తోంది. చనిపోయిన కుటుంబ సభ్యుల పేరుతో నకిలీ పత్రాలు సృష్టించడం.. వాటి ఆధారంగా జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (జీపీఏ).. ఆ తర్వాత రిజిస్ట్రేషన్.. వెనువెంటనే విక్రయించడం చకాచకా సాగించిన ముఠా వెనుక అసలు సూత్రధారి సదరు ఎమ్మెల్యేనని స్పష్టమవుతోంది. ఉద్యోగాలు చేసుకుంటూ కొంచెం కొంచెం కూడబెట్టుకుని అన్ని అనుమతులు ఉన్న మధురవాడ సర్వే నెంబరు 203/14ఏ పార్టు బ్యాంక్ ఆఫీసర్స్ హౌసింగ్ లే అవుట్‌లో పలువురు స్థలాలు కొనుగోలు చేశారు. కొన్నాళ్లగా అక్కడకు రాకుండా ఉన్న వారితో పాటు చనిపోయిన వారి ప్లాట్ల వివరాలు తెలుసుకొని ఒక ముఠా నకిలీ అడంగల్, ఎఫ్‌ఎంబీలను సృష్టించింది. ఈ లే–అవుట్‌లో ఏకంగా 1,572.66 గజాల స్థలానికి ఈ విధంగా నకిలీ పత్రాలు సృష్టించి 2025 మే 28వ తేదీన జీపీఏ చేసుకోవడంతోపాటు 2025 మే 31వ తేదీన విక్రయించేసింది. ఈ పనులన్నీ చకాచకా సాగిపోవడం వెనుక కూటమి ఎమ్మెల్యే పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. సదరు ఎమ్మెల్యేకు 1,206 గజాలు, నకిలీ పత్రాలు సృష్టించిన వారికి 366.66 గజాలు చెందేటట్టుగా డీల్ కుదిరినట్టు సమాచారం. స్థల యజమాని ఫిర్యాదుతో నకిలీ పత్రాలు సృష్టించినవారు ఇటీవల అరెస్టు అయ్యారు. అసలు సూత్రధారి ఎమ్మెల్యే కావడంతో విచారణలో ముందుకెళ్లేందుకు పోలీసులు కూడా జంకుతున్నట్లు తెలుస్తోంది. తనకు సంబంధం లేని నియోజకవర్గంలో సదరు ఎమ్మెల్యే చక్రం తిప్పుతుండటంపై కూటమిలోని ఇతర ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.
బాగోతం వెనుక ఓ ఎమ్మెల్యే..!
వాస్తవానికి తప్పుడు పత్రాలను సృష్టించడంతో పాటు రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత భూమిలో ఫెన్సింగ్ వేయడంలో అసలు సూత్రధారి కూటమి ఎమ్మెల్యేననే తెలుస్తోంది. పైకి అనిల్, వెంకటేష్, దిలీప్ కుమార్ కనిపిస్తున్నా వెనుక ఉండి నడిపించేదంతా ఆయననే సమాచారం. మొత్తం 1,572.66 గజాల స్థలంలో 1,206 గజాల స్థలం సదరు కూటమి ఎమ్మెల్యే ఖాతాలోకి చేరనున్నట్లు తెలుస్తోంది. మిగిలిన 366.66 గజాల స్థలం వీరికి చెందేలా సదరు ఎమ్మెల్యే వద్ద డీల్ కుదిరినట్టు సమాచారం. రిజిస్ట్రేషన్ శాఖ లెక్కల ప్రకారం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మధురవాడ ప్రాంతంలో గజం విలువ రూ.50 వేల మేర ఉంది. అంటే మొత్తం 1,572.66 గజాల విలువ రూ.7.86 కోట్లు అన్నమాట. ఇక మార్కెట్ విలువ ప్రకారం ఈ స్థలం ఖరీదు రూ.12 కోట్లకుపైగానే ఉంటుంది. ఇందులో సదరు ఎమ్మెల్యే ఖాతాలో ఉన్న 1,206 గజాల స్థలం విలువ రూ.9 కోట్ల పైమాటే. ఈ వ్యవహారంలో కూటమి పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడని తెలియడంతో పోలీసులు విచారణలో లోతుగా వెళ్లడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నియోజకవర్గానికి సంబంధంలేని ఎమ్మెల్యే జోక్యం చేసుకుంటుండటంపై కూటమి పార్టీలో కూడా చర్చనీయాంశమైంది.