
వైద్యారోగ్య రంగ బలోపేతానికి చర్యలు
● మంత్రి సత్యకుమార్ ● మెంటల్ కేర్ ఆసుపత్రిలో నూతన భవనాలు ప్రారంభం
బీచ్‌రోడ్డు: రాష్ట్రంలో వైద్యారోగ్య రంగాన్ని బలోపేతం చేయడానికి వినూత్న చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. నిమ్స్ స్థాయికి విమ్స్‌ను తీర్చిదిద్దుతామని, ఇందుకు సంబంధించి కార్యాచరణను రూపొందిస్తున్నట్లు స్పష్టం చేశారు. వచ్చే ఏడాది నుంచి సైకియాట్రీ విభాగంలో ఎమ్మెస్సీ లేదా డిప్లమో, క్లినికల్ సైకాలజీలో 30 సీట్లతో కూడిన ఎం.ఫిల్ కోర్సులను ప్రవేశపెడతామని మంత్రి వెల్లడించారు. మెంటల్ కేర్ ఆసుపత్రి ప్రాంగణంలో రూ. 29.70 కోట్లతో నిర్మించిన భవనాలను, పోలమాంబ గుడి సమీపంలోని భానోజీనగర్‌లో రూ.1.38కోట్లతో నిర్మించిన ఆయు ష్మాన్ ఆరోగ్య మందిర్ (యూపీహెచ్‌సీ)ను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో 15 కోట్ల మంది మానసిక వ్యాధులతో బాధపడుతున్నారని, వారిలో 80 శాతం మందికి తమ రోగం గురించి తెలియదన్నారు. రాష్ట్రంలో మానసిక వైద్యులు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారని, ఈ లోటును అధిగమించేందుకు యువత మానసిక కోర్సులను ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఇటీవల కోస్టల్ తీరంలో జరిపిన సర్వేల ప్రకారం 14.5 శాతం మంది బాలింతలు మానసిక సమస్యలతో బాధపడుతున్నారని, గ్రామీణ ప్రాంతాల్లో ఈ సంఖ్య 19 శాతం, గిరిజన ప్రాంతాల్లో 21 శాతంగా ఉందన్నారు. 2020–21 గణాంకాల ప్రకారం, వివిధ కారణాలతో 8,062 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని, గత ఏడాది ఈ పరిస్థితి 48 శాతం పెరిగిందన్నారు. వారిలో 34 శాతం మంది దీర్ఘకాలిక వ్యాధుల వల్ల చనిపోతే, 7 శాతం కేవలం మానసిక సమస్యల వల్లే ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. మెంటల్ కేర్ ఆసుపత్రి పేరు మార్చాలని సూపరింటెండెంట్ డా. కె.వి.రామిరెడ్డి, ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రతిపాదించగా.. పేరు మారిస్తే ఇబ్బందులు రావచ్చని, ఆలోచించి తగిన నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ మానసిక వైద్యంలో మరింత నాణ్యత పెరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ మాట్లాడుతూ ఎవరికై నా మానసిక సమస్యలుంటే తగిన చికిత్స చేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవిరావు, మేయర్ పీలా శ్రీనివాసరావు, తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, మెడికల్ ఎడ్యుకేషన్ అడిషనల్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, కార్పొరేటర్ మువ్వల లక్ష్మీసురేష్ పాల్గొన్నారు.