
ఎస్టీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ తప్పనిసరి
మద్దిలపాలెం: అన్ని ప్రభుత్వ శాఖలు, యూనివర్సిటీలతోపాటు, ప్రైవేట్ సంస్థల్లో నియామక ప్రక్రియలో ఎస్టీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావు తెలిపారు. ఏయూ ఎస్టీ ఉద్యోగ సంఘ సభ్యులతో సోమవారం ఆయన సమావేశమయ్యారు. ఏయూలో ఎస్టీ రిజర్వేషన్ అమలు, ఉద్యోగుల రోస్టర్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ నియామకాల్లో ఎస్టీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ తప్పక పాటించాలన్నారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ నియామకాల్లోనూ తప్పనిసరన్నారు. అనంతరం ఆయన ఎస్టీ విద్యార్థులతో ముఖాముఖి సమావేశమయ్యారు. వారి సమస్యలు, సౌకర్యాలపై ఆరా తీశారు. పెరిగిన టెక్నాలజీని ఆయుధంగా ఉపయోగించుకుని ఉన్నత స్థితికి చేరుకోవాలని సూచించారు.
జీసీసీ పటిష్టతకు ప్రభుత్వానికి సిఫార్సు చేస్తాం
మహారాణిపేట: గిరిజన ప్రాంతాల్లో వారు పండించిన ఉత్పత్తుల నిల్వకు కోల్డ్ స్టోరేజీలు, గొడౌన్‌లు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయనున్నట్లు ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావు తెలిపారు. విశాఖ జిల్లా పర్యటనలో భాగంగా స్థానిక జీసీసీ కార్యాలయంలో సోమవారం సమీక్ష జరిపారు. తొలుత గిరిజన సంక్షేమం కోసం జీసీసీ చేపడుతున్న కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జీఎం(అడ్మిన్) జి.సంధ్యారాణి వివరించారు. అనంతరం చైర్మన్ జీసీసీ ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్ చర్యలపై ఆరా తీశారు. సీనియర్ మేనేజర్(కాఫీ) టి.శ్రీనివాసరావు, విజిలెన్స్ ఆఫీసర్ ఎంవీవీఎస్ ఉమాదేవి, ఫైనాన్స్ జీఎం నిర్మలమ్మ, మార్కెటింగ్ జీఎం త్రినాథరావు, డీజీఎం(డీఆర్‌ఎస్) సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.