
మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి
జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్
అల్లిపురం: ప్రజలకు అందించే సంక్షేమ కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించి సుపరిపాలనకు సహకరించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ విభాగాధిపతులను ఆదేశించారు. సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. వివిధ శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని, పెండింగ్ సమస్యలను త్వరగా పరిష్కరించాలని కమిషనర్ సూచించారు. ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ శాఖలు రహదారుల విస్తరణ, టీడీఆర్ జారీ వంటి అంశాల్లో ఉమ్మడి క్షేత్ర పరిశీలన చేసి వేగంగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. అలాగే ప్రజా ఆరోగ్యం, ఇంజనీరింగ్ విభాగాలు సమన్వయంతో గెడ్డల పూడికతీత, వస్తు సామగ్రి కొనుగోలు వంటి వాటిలో సత్వర ఫలితాలు రాబట్టాలని సూచించారు. మంగళవారం నుంచి శాఖల వారీగా సమీక్షలు, ప్రతి శనివారం సిబ్బంది పనితీరును స్వయంగా పరిశీలిస్తానని కమిషనర్ తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్లు డీవీ రమణమూర్తి, ఎస్‌ఎస్ వర్మ, ప్రధాన వైద్యాధికారి ఈన్‌వీ నరేష్‌కుమార్, ప్రధాన ఇంజనీర్ పల్లపు రాజు తదితరులు పాల్గొన్నారు.