
ఛీకెన్ వ్యర్థాల వ్యాపారం
కూటమి నేతల
వాస్తవానికి జీవీఎంసీ పరిధిలోని 8 జోన్లల్లో...జోన్‌కు ఒకరు చొప్పున చికెన్ వ్యర్థాల తరలింపు కాంట్రాక్టును అప్పగించారు. అయితే కాంట్రాక్టర్లు అక్రమాలకు పాల్పడుతున్న వైనంపై ‘సాక్షి’లో వరుస కథనాలకు స్పందించిన కలెక్టర్ సదరు కాంట్రాక్టును రద్దు చేశారు. తిరిగి కోర్టు ఆదేశాలతో కాంట్రాక్టర్లు పనికానిస్తున్నారు. కాంట్రాక్టర్లతో పాటు జోన్‌కు ఒకరు చొప్పున కూటమి నేతలు అనధికారికంగా చికెన్ వ్యర్థాల సేకరణను ప్రారంభించారు. ఆయా జోన్లల్లో అనధికారికంగా చికెన్ వ్యర్థాలను సేకరిస్తున్నారు. అయితే ఈ వ్యర్థాల సేకరణను కాంట్రాక్టు పొందిన వ్యక్తులు అడ్డుకోకుండా రౌడీషీటర్లతో పహారా కాయిస్తూ మరీ వ్యర్థాల సేకరణ చేపడుతుండటం గమనార్హం. ఒక్కో ప్రాంతానికి ఒక్కో రౌడీషీటరు ఈ చికెన్ వ్యర్థాల సేకరణ బాధ్యతలు చూస్తున్నారు. వీరికి ప్రధానంగా కూటమి పార్టీల్లోని ముఖ్యమైన నేతల అండదండలుండటమే ఇందుకు కారణం. ఒక్కో జోన్‌కు ఒక్కో కూటమి నేత అండదండలు అందిస్తున్నారు. ఏకంగా ఒక జిల్లా స్థాయి నేత పోలీసుస్టేషన్‌కు వెళ్లి మరీ కేసులు పెట్టాలంటూ ఒత్తిళ్లు తేవడం చర్చనీయాంశమయ్యింది. అంతేకాకుండా అటు జనసేన ఎమ్మెల్యే, ఇటు టీడీపీ మాజీ ఎమ్మెల్యే, కార్పొరేషన్‌లోని కీలక నేత ఒకరు అండదండలతో ఈ వ్యవహారమంతా సాగుతోంది. మొన్నటివరకు డిప్యూటీ మేయర్ పోస్టు ఆశించిన గంధం శ్రీను పేరు ఇప్పుడు ఏకంగా వ్యర్థాలను తరలిస్తున్న డ్రైవర్ పేర్కొనడం గమనార్హం. మొత్తంగా కూటమి నేతల అండదండలతో రౌడీషీటర్ల పహారాలతో చికెన్ వ్యర్థాల తరలింపు వ్యవహారం భారీగా సాగుతోంది. ఇందుకు కలెక్టర్ ఆదేశాలు కూడా బుట్టదాఖలవుతుండటమే అసలైన వైచిత్రి!
ప్రజల ఆరోగ్యంతో చెలగాటం
చికెన్ వ్యర్థాల అక్రమ రవాణా ద్వారా ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతు న్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యర్థాలను అక్రమంగా సేకరిస్తున్న ముఠాలు వాటిని అధిక ధరలకు చేపలు, రొయ్యల చెరువుల యజమానులకు విక్రయిస్తున్నాయి. ఈ వ్యర్థాలను ఆహారంగా తీసుకున్న చేపలు, రొయ్యలు త్వరగా బరువు పెరుగుతుండడంతో, మేత ఖర్చు తగ్గించుకోవడానికి చెరువుల యజమానులు ఈ అక్రమాలకు పాల్పడు తున్నారు. ఈ వ్యవహారం నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నప్పటికీ, జీవీఎంసీ ప్రజారోగ్య విభాగం, మత్స్యశాఖ, పోలీసు శాఖ అధికారులు ఎవరూ దీనిపై దృష్టి పెట్టడం లేదు. పైగా, అక్రమ రవాణాకు పాల్పడుతున్నవారు తమకు జీవీఎంసీకి చెందిన అధికారి కిషోర్ సహకరిస్తున్నారని నిస్సంకోచంగా చెబుతుండడం గమనార్హం. అయితే తన పేరును ఎవరో కావాలని చెబుతున్నారని జీవీఎంసీ వెటర్నరీ అధికారి కిషోర్ ఈ ఆరోపణలను ఖండించారు. అంతేకాకుండా, చికెన్ వ్యర్థాలు కాపులుప్పాడలోని నిర్ణీత ప్రాంతానికి చేరాయా లేదా అని పరిశీలించాల్సిన అధికారులు కూడా ఈ అక్రమాలకు భాగస్వాములవుతూ తప్పుడు నివేదికలను సమర్పిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కలెక్టర్ స్వయంగా జారీ చేసిన ఆదేశాలను కూడా లెక్క చేయకుండా, కూటమి నేతల అండదండలతో అధికారులు ఈ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. ఈ వ్యర్థాలను ఆహారంగా తీసుకున్న చేపలు, రొయ్యలను మనం తినడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాలేయ, జీర్ణకోశ, నాడీ సంబంధిత సమస్యలు, మహిళల్లో నెలసరి సమస్యలు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉంది.
విశాఖ నుంచి కాకినాడకు తరలింపు
జోన్‌కు ఒకరి పేరుతో అనధికారికంగా వ్యర్థాల సేకరణ
అడ్డువస్తే దాడులు చేస్తామని హెచ్చరికలు
కలెక్టర్ హెచ్చరించినా ఆగని అక్రమాలు
నేరుగా టీడీపీ కార్పొరేటర్ గంధం శ్రీను పేరు వెల్లడి
సహకరిస్తున్న జీవీఎంసీ అధికారులు
ఇవే కాదు ఏపీ39వీబీ 0302 బొలెరో వాహనంతో పాటు అనేక వాహనాల్లో అక్రమంగా చికెన్ వ్యర్థాలను తరలిస్తున్నారు. జీవీఎంసీ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా నేరుగా అక్రమాలకు కూడా సహకరిస్తున్నారు. ఫలితంగా కలెక్టర్ జోక్యం చేసుకుని చికెన్ వ్యర్థాల అక్రమ తరలింపును అరికట్టి...కాపులుప్పాడకు తరలించాలని చెబుతున్నప్పటికీ అక్రమార్కులు కనీసం పట్టించుకోవడం లేదు. కూటమి పార్టీలకు చెందిన నేతలు సహకరిస్తుండటమే ఇందుకు కారణం. దీంతో చికెన్ వ్యర్థాలను నేరుగా కాకినాడ, రాజమండ్రి, యలమంచిలి, ఎస్.రాయవరం తదితర ప్రాంతాల్లోని చేపల చెరువులకు తరలిస్తున్నారు. విశాఖ నగరం నుంచి రోజుకు జోన్‌కు రెండు చొప్పున మొత్తం 16 వాహనాల్లో అక్రమంగా చికెన్ వ్యర్థాలను తరలిస్తున్నారు. ఒక్కో వాహనంలోని వ్యర్థాలను విక్రయించడం ద్వారా ఖర్చులు పోను రూ. 10 వేల వరకూ సంపాదిస్తున్నట్టు తెలుస్తోంది. అంటే ప్రతీ రోజూ రూ.1.6 లక్షలను అక్రమంగా ఆర్జిస్తున్నారన్నమాట. అంటే నెలకు రూ. 48 లక్షల మేర కూటమి నేతలు కేవలం చికెన్ వ్యర్థాల తరలింపు ద్వారా జేబులు నింపుకుంటున్నట్టు అర్థమవుతోంది.
– సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం

ఛీకెన్ వ్యర్థాల వ్యాపారం

ఛీకెన్ వ్యర్థాల వ్యాపారం