నిస్తార్‌ | - | Sakshi
Sakshi News home page

నిస్తార్‌

Jul 13 2025 4:27 AM | Updated on Jul 13 2025 4:27 AM

నిస్త

నిస్తార్‌

ఆదివారం శ్రీ 13 శ్రీ జూలై శ్రీ 2025

నౌకాదళానికి

నూతన శక్తి

సాక్షి, విశాఖపట్నం: భారత్‌–పాక్‌ యుద్ధ సమయంలో విశాఖపట్నం సహా తూర్పు తీరాన్ని నాశనం చేయడానికి దూసుకొచ్చిన పీఎన్‌ఎస్‌ ఘాజీ జలాంతర్గామిని ఐఎన్‌ఎస్‌ నిస్తార్‌ యుద్ధనౌక ధ్వంసం చేసింది. దాయాది దేశంతో జరిగిన యుద్ధంలో చారిత్రక విజయాన్ని అందించిన ఆ నిస్తార్‌ 1989లో సేవల నుంచి నిష్క్రమించింది. ఇప్పుడు.. ఆ ప్రతిష్టాత్మక విజయానికి ప్రతీకగా, పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మితమైన కొత్త ఐఎన్‌ఎస్‌ నిస్తార్‌ యుద్ధనౌక భారత నౌకాదళ అమ్ములపొదిలో చేరనుంది. హిందూస్థాన్‌ షిప్‌యార్డ్‌ నిర్మించిన ఈ డైవింగ్‌ సపోర్ట్‌ వెసల్‌ను ఈ నెల 18న భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ జాతికి అంకితం చేయనున్నారు. విశాఖపట్నం కేంద్రంగా నిస్తార్‌ తన సేవలను అందించనుంది.

భారత రక్షణ రంగం నిస్తార్‌ నిర్మాణంతో కీలక మైలురాయిని అధిగమించింది. ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’లో భాగంగా పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో నౌకల తయారీకి ఉపక్రమించిన హిందూస్థాన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎస్‌ఎల్‌) సాంకేతిక సంస్కరణలు చేసుకుంటూ.. ఐఎన్‌ఎస్‌ నిస్తార్‌ యుద్ధనౌకను అందుబాటులోకి తీసుకొచ్చింది. దాదాపు 15 సార్లు సీ ట్రయల్స్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ జలాంతర్గామి రక్షణ నౌక.. నౌకాదళ అమ్ములపొదిలో చేరి సేవలందించనుంది. నిస్తార్‌ క్లాస్‌ నౌకల రూపకల్పన, సామర్థ్యాలను ధ్రువీకరించేందుకు పలు సార్లు హార్బర్‌ ట్రయల్స్‌, సీ ట్రయల్స్‌ నిర్వహించారు. ‘యార్డ్‌–11190’ పేరుతో రూపొందించిన ఈ నౌకలో ఏర్పాటు చేసిన ఎయిర్‌/మిక్స్‌డ్‌ డైవింగ్‌ కాంప్లెక్స్‌ షిప్‌ 75 మీటర్ల లోతు వరకు డైవింగ్‌ చేయడానికి వీలు కల్పిస్తుంది. నీటి అడుగున డైవింగ్‌ సర్వేలు, తనిఖీలు నిర్వహించేందుకు ఇది కీలకంగా వ్యవహరిస్తుంది. సముద్ర గర్భం నుంచి 15 టన్నుల బరువును ఎత్తేందుకు వీలుగా నౌకలో మైరెన్‌ క్రేన్‌ కూడా ఏర్పాటు చేశారు.

18న జాతికి అంకితం చేయనున్న రక్షణ మంత్రి

ఇటీవలే అన్ని పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసిన హిందూస్థాన్‌ షిప్‌యార్డ్‌.. నిస్తార్‌ను భారత నౌకాదళానికి అప్పగించింది. ఈ నెల 18న విశాఖపట్నం వేదికగా జరిగే కార్యక్రమంలో ఈ యుద్ధనౌకను రాజ్‌నాథ్‌ సింగ్‌ జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం తూర్పు నౌకాదళం నుంచి నిస్తార్‌ తన సేవలందిస్తుంది. నిస్తార్‌ క్లాస్‌లో మరో యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ నిపుణ్‌ కూడా షిప్‌యార్డ్‌లో సిద్ధం అవుతోంది. దీన్ని వచ్చే ఏడాది ఇండియన్‌ నేవీకి అప్పగించేలా పనులు చురుగ్గా నిర్వహిస్తున్నారు. 80 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో ఒక నౌక తయారు కాగా.. ఇంకొకటి సిద్ధమవుతోంది. సాధారణంగా ప్రతి యుద్ధనౌకలోనూ 5 జనరేటర్లు ఉంటాయి. ఇప్పటివరకు 2 మెగావాట్ల డీజిల్‌ జనరేటర్లు మాత్రమే వార్‌షిప్స్‌లో వినియోగించారు. కానీ నిస్తార్‌కు మాత్రం 3 మెగావాట్ల జనరేటర్‌ను ప్రత్యేకంగా డిజైన్‌ చేశారు. నిస్తార్‌ 300 మీటర్ల లోతు వరకు కార్యకలాపాలు నిర్వహించగలదు. డీప్‌ సబ్‌మెర్జెన్స్‌ రెస్క్యూ వెహికల్‌తో అమర్చబడి, నిస్తార్‌ క్లాస్‌ షిప్‌ ఆపదలో ఉన్న జలాంతర్గాములకు కూడా సహాయం చేయగలదు. సముద్రంలో నిరంతర గస్తీ, పరిశోధన, రక్షణ కార్యకలాపాలకు నిస్తార్‌ కీలకంగా మారనుందని నౌకాదళ వర్గాలు వెల్లడించాయి.

నిస్తార్‌1
1/2

నిస్తార్‌

నిస్తార్‌2
2/2

నిస్తార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement