
పారదర్శకంగా ఉద్యోగ నియామకాలే లక్ష్యం
● కేంద్ర మంత్రి రామ్మోహననాయుడు ● రోజ్‌గార్ మేళాలో పలువురికి నియామకపత్రాల అందజేత
తాటిచెట్లపాలెం: రాజకీయ జోక్యం, సిఫారసులకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా ఉద్యోగనిమాకాలు చేపట్టడమే నరేంద్రమోదీ లక్ష్యమని, దీనికోసమే రోజ్‌గార్ మేళాలను నిర్వహించి లక్షలాదిమందికి నియామక పత్రాలు ఇప్పటికే అందజేశారని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్‌నాయుడు తెలిపారు. ఈస్ట్‌కోస్ట్‌రైల్వే, వాల్తేర్ డివిజన్ ఆధ్వర్యంలో సాలగ్రామపురంలోని పోర్టు సాగరమాల కన్వెన్షన్స్ సెంటర్‌లో 16వ రోజ్‌గార్ మేళా శనివారం ఘనంగా జరిగింది. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారం దేశవ్యాప్తంగా 47 ప్రాంతాల్లో నియామకపత్రాలు అందజేసినట్టు చెప్పారు. విశాఖలో జరిగిన మేళాలో రైల్వే, పోస్టల్, హెచ్‌పీసీఎల్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐఐఎం వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లోని వివిధ విభాగాల్లో ఉద్యోగాలు పొందిన సుమారు 52మందికి అతిథుల చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వాల్తేర్ డివిజన్, డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్‌బోరా, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్ రాజు, ఏడీఆర్‌ఎంలు మనోజ్‌కుమార్ సాహూ(ఆపరేషన్స్), ఈ.శాంతారాం(ఇన్‌ఫ్రా), సీనియర్ డీపీవో జూసుఫ్ కబీర్ అన్సారీ, పలు సంస్థల అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు. అంతకుముందు ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించి, ప్రసంగించారు.