
సమన్వయంతో ‘ఐఎఫ్‌ఆర్’ విజయవంతం
కలెక్టర్ హరేందిర ప్రసాద్
మహారాణిపేట: నేవల్ కమాండ్ ఆధ్వర్యంలో 2026 ఫిబ్రవరిలో జరగనున్న ఐ.ఎఫ్.ఆర్/మిలన్, ఐవోఎన్‌ఎస్ కాంక్లేవ్ ఆఫ్ చీఫ్స్ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నేవీ, ఎయిర్‌పోర్టు, పోర్ట్ అథారిటీ, కస్టమ్స్, రెవెన్యూ, వీఎంఆర్డీఏ, జీవీఎంసీ, పోలీసు, పర్యాటక శాఖ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆయా విభాగాలు చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో వ్యవహరించి వేడుకలను విజయవంతం చేయాలని సూచించారు. తొలుత కమోడోర్ ఏబీ మాథ్యూ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివిధ శాఖల విధులను వివరించి.. వారి సహకారాన్ని కోరారు. సమావేశంలో నేవల్ ఆఫీస్ ఇన్‌చార్జి(ఏపీ) రజనీష్ శర్మ, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, డీసీపీలు అజిత, మేరీ ప్రశాంతి, నేవల్ అధికారులు పాల్గొన్నారు.