
ఉక్కు పైలాన్ చుట్టూ కంచె
ఉక్కు కార్మికుల
ఆందోళనకు మరో అడ్డంకి
కూర్మన్నపాలెం: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలోని పైలాన్ వద్ద జరుగుతున్న కార్మికుల దీక్షకు యాజమాన్యం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలకు ఆందోళనకారులు ఏర్పాటు చేసిన టెంట్ కూలిపోగా, దాన్ని తిరిగి నిర్మించుకోవడానికి యాజమాన్యం అనుమతించకుండా, అక్కడ హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేసింది. దీంతో కార్మికులు ఎండకు, వానకు గొడుగులు పట్టుకొని నిరసన కొనసాగిస్తున్నారు. తాజాగా ఉక్కు యాజమాన్యం పైలాన్ ప్రాంతం చుట్టూ కంచె వేసి, కార్మికులు ఆ ప్రాంతంలోకి అడుగు పెట్టకుండా నిరోధించింది. యాజమాన్యం నిరంకుశంగా వ్యవహరిస్తోందని, న్యాయబద్ధంగా నిరసన తెలిపే హక్కును హరిస్తోందని కార్మికులు, కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఈ అంశంపై ఇప్పటికే న్యాయస్థానంలో కేసు పెండింగ్‌లో ఉండగా, యాజమాన్యం ఇలాంటి చర్యలు తీసుకోవడం సమంజసం కాదని కార్మిక నాయకులు పేర్కొంటున్నారు. యాజమాన్యం తమ నిర్ణయాన్ని మార్చుకొని, కార్మికులు శాంతియుతంగా ఆందోళన చేసుకోవడానికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.