
తప్పుడు పత్రాలతో భూకబ్జా
మధురవాడ: తమ తాత, ముత్తాతలకు సంబంధించిన ఆస్తి అని.. అడంగల్, ఎఫ్‌ఎంబీల్లో వారి పేర్లు ఉన్నాయని నమ్మించారు. దానికి జీపీఏ చేయించుకుని తద్వారా సేల్ డీడ్ తయారు చేయించుకున్నారు. ఇలా రిటైర్డ్ ఉద్యోగికి చెందిన భూమిని ఆక్రమించిన ముగ్గురు వ్యక్తులను పీఎంపాలెం పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి నార్త్ జోన్ ఏసీపీ అప్పలరాజు శుక్రవారం వివరాలు వెల్లడించారు. 1983 ప్రాంతంలో మధురవాడ రెవెన్యూ గ్రామం సర్వే నంబర్ 203 పార్ట్ రేవళ్లపాలెంలోని బ్యాంక్ ఆఫీసర్స్ హౌసింగ్ లే అవుట్‌లో కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన ఆర్‌ఎస్‌ఎస్ ప్రకాశరావు, మరికొందరు 300 గజాల చొప్పున ప్లాట్‌లు కొనుగోలు చేశారు. ఇందులో కొందరు మరణించగా మరికొందరి వారసులు దేశ, విదేశాల్లో ఉన్నారు. దీన్ని అదనుగా భావించి మధురవాడ రేవళ్లపాలేనికి చెందిన బెవర అనిల్‌కుమార్, అతని అన్న వెంకటేష్, శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపురానికి చెందిన పగోటి దిలీప్‌కుమార్ మరికొంత మంది వ్యక్తులతో కలిసి.. రేవళ్లపాలెం పరిసర ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న భూములకు తప్పుడు డాక్యుమెంట్‌లు సృష్టించి అక్రమంగా విక్రయిస్తున్నారు. ఇదే విధంగా అనిల్, దిలీప్‌కుమార్ ఫిర్యాదిదారు అయిన ప్రకాశరావు ఆస్తిని కాకినాడకు చెందిన రామ పద్మజకు అమ్మేశారు. అలాగే గత నెల 28న రేవళ్లపాలెం శ్రీనివాస స్కూల్ సమీపంలోని భూమిలోకి అర్ధరాత్రి కొంత మంది వ్యక్తుల సహాయంతో పొక్లెయిన్, లారీలతో చొరబడి ఫెన్సింగ్ వేయడానికి ప్రయత్నించారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఫిర్యాదిదారు అక్కడకు చేరుకుని ఆపే ప్రయత్నం చేయగా.. అతన్ని భయభ్రాంతులకు గురిచేశారు. ఇక్కడ సుమారు ఐదు ప్లాట్‌లకు చెందిన 1,500 గజాల భూమిని ఆక్రమించడానికి ప్రయత్నం చేయడంతో బాధితులు పీఎంపాలెం పోలీసులను ఆశ్ర యించారు. విచారణ ప్రారంభించిన సీఐ బాలకృష్ణ, ఎస్‌ఐ డి.రాము అక్రమార్కులు నకిలీ పత్రాలతో కె. కోటపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తప్పుడు జీపీఏ పొంది.. దాని ద్వారా ఇతరులకు సేల్ డీడ్ చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. వీరు 2019, 2025లో కూడా ఇలానే ప్రైవేట్ స్థలాలను విక్రయించినట్లు విచారణలో తేలింది. ఈ మేరకు నిందితులు అనిల్ కుమార్, వెంకటేష్, దిలీప్‌కుమార్‌లను అదుపులోకి తీసుకుని, రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి మధురవాడ పరిసర ప్రాంతాలకు చెందిన అడంగల్, ఎఫ్‌ఎంబీ పుస్తకాలను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ అప్పలరాజు తెలిపారు. ఈ వ్యవహారంలో ఇంకా ఎంత మంది ఉన్నారనే విషయంపై సమగ్ర విచారణ చేస్తున్నట్లు వివరించారు.
ముగ్గురు నిందితుల అరెస్ట్
ప్రభుత్వ అడంగల్ పుస్తకాలు స్వాధీనం