
ప్రమాదాల జంక్షన్
పరవాడ: అనకాపల్లి–విశాఖ జాతీయ రహదారిలోని లంకెలపాలెం కూడలిలో జరుగుతున్న ప్రమాదాలతో ప్రజలు, ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. డ్రైవర్ల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం తమ పాలిట శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
శుక్రవారం రాత్రి ఏం జరిగిందంటే?
విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి ఇనుప ప్లేట్లతో ఖమ్మం వెళ్తున్న ఒక భారీ ట్రాలర్.. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో లంకెలపాలెం కూడలి వద్ద అదుపు తప్పింది. వేగంగా దూసుకొచ్చిన ఈ ట్రాలర్.. ఫ్రీ–లెఫ్ట్ మార్గంలోని సిమెంట్ దిమ్మలను బలంగా ఢీకొని పక్కనే ఉన్న మురుగు కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలవగా, ట్రాలర్ ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. రాత్రి సమయం కావడంతో కూడలిలో జన సంచారం లేదు. దీంతో పెను ప్రమాదం తప్పిందని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు క్రేన్ సహాయంతో ట్రాలర్‌ను తొలగించి, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఈ ఘటనపై సీఐ ఆర్.మల్లికార్జునరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. గత నెల 23న విశాఖ నుంచి అనకాపల్లి వెళ్తున్న ఓ లారీ బ్రేకులు విఫలం కావడంతో సిగ్నల్ వద్ద ఆగి ఉన్న జనంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. గత నెల 3న విశాఖ పోర్టు నుంచి వస్తున్న బొగ్గు లారీ బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఒక కారు, ఆటో ధ్వంసం కాగా, సిగ్నల్ లైట్లు, విద్యుత్ స్తంభం, హైమాస్ట్ లైట్ నేలమట్టమయ్యాయి. రెయిలింగ్ పూర్తిగా దెబ్బతింది. ఆటోలోని నలుగురు గాయపడ్డారు. నిత్యం రద్దీగా ఉండే ఈ కూడలిలో డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ ప్రమాదాల నివారణకు ప్రభుత్వం శాశ్వత చర్యలు చేపట్టాలని, ఫ్లైఓవర్ నిర్మించాలని కోరుతున్నారు.
లంకెలపాలెం కూడలిలో
బెంబేలెత్తిస్తున్న ప్రమాదాలు
తాజాగా అదుపుతప్పిన భారీ ట్రాలర్
ఫ్లైఓవర్ నిర్మించాలని స్థానికుల డిమాండ్