
కేసుల రాజీతో సత్వర పరిష్కారం
విశాఖ లీగల్: కేసులను సామరస్యపూర్వక వాతావరణంలో రాజీ చేసుకోవడం మంచిదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు న్యాయవాదులకు సూచించారు. శుక్రవారం న్యాయవాదుల నూతన సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. కేసుల సత్వర పరిష్కారానికి మధ్యవర్తిత్వం ఎంతో ప్రయోజనకరమన్నారు. మధ్యవర్తిత్వం వల్ల కలిగే లాభాలను ప్రజలకు వివరించడానికి 90 రోజుల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, దీనికి అందరూ సహకరించాలని కోరారు. న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎంకే శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రాథమిక దశలోనే మధ్యవర్తిత్వం ద్వారా ప్రయోజనాలు పొందవచ్చన్నారు. న్యాయ సేవా ప్రాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఆర్. సన్యాసినాయుడు మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి మధ్యవర్తిత్వ విధానాన్ని అవలంబించాలని సూచించారు. న్యాయవాదులందరూ ఈ చట్టంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, అవసరమైతే ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమాలు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో 90 రోజుల పాటు జరుగుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం కార్యదర్శి ఎల్.పి. నాయుడు, ఇతర న్యాయమూర్తులు, న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.