
‘పీటీఎం’ బహిష్కరించిన తల్లిదండ్రులు
కంచరపాలెం: జీవీఎంసీ 56వ వార్డు కంచరపాలెం ప్రాథమిక పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ 2.0 ఆత్మీయ సమావేశాన్ని తల్లిదండ్రులు బహిష్కరించారు. గత నెలలో పాఠశాలను మూసివేసేందుకు అధికారులు ప్రయత్నించగా, విద్యార్థుల తల్లిదండ్రులు అడ్డుకుని ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. జిల్లా విద్యాశాఖాధికారులు సమస్యను పరిష్కరించకపోవడంతో, ఉన్న నలుగురు ఉపాధ్యాయులతోనే పాఠశాల కొనసాగుతోంది. ఈలోగా కొంతమంది తల్లిదండ్రులు ఇతర పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించారు. గురువారం జరిగిన పేరెంట్ మీట్‌కు ప్రజాప్రతినిధులు, అధికారులు వస్తారనే ఉద్దేశంతో, వార్డు మాజీ కార్పొరేటర్ బొట్టా ఈశ్వరమ్మ నేతృత్వంలో తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని నిరసన తెలిపారు. పాఠశాలను తరలిస్తే ఉద్యమం చేపడతామని హెచ్చరించిన ఈశ్వరమ్మ.. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలు మూతబడేలా చేసి మెగా పేరెంట్ మీట్‌లతో పండగ చేసుకుంటుందని ఆరోపించారు. పేరెంట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.