
ఆన్‌లైన్‌లో 10 వేల నాటక పుస్తకాలు
సీతంపేట: నాటకం కోసం జీవితాన్ని అంకితం చేసిన బాదంగీర్ సాయి జ్ఞాపకార్థం 10 వేల నాటక పుస్తకాలను డిజిటలైజ్ చేసి, ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని విశ్రాంత ఐఏఎస్ గుమ్మళ్ల బలరామయ్య ప్రశంసించారు. రైటర్స్ అకాడమీ ఆధ్వర్యంలో ద్వారకానగర్‌లోని పౌరగ్రంథాలయంలో ఆదివారం ‘తెలుగు నాటక డిజిటల్ గ్రంథాలయం’ వెబ్‌సైట్ ఆవిష్కరణ సభ జరిగింది. మనసు ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మన్నం వెంకటరాయుడు, అతిథులతో కలిసి ఈ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బలరామయ్య మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు నాటకాలను అందించడానికి బాదంగీర్ సాయి స్వయంగా ఒక లైబ్రరీని నిర్వహించారన్నారు. సాయి అద్దె ఇంట్లో ఉంటూనే 10 వేల నాటకాల పుస్తకాలను సేకరించారని, ఎవరైనా నాటక పుస్తకం కావాలంటే ఆయన జిరాక్స్ తీసి ఇచ్చేవారని గుర్తు చేశారు. తన కుమార్తె సృజన జీవీఎంసీ కమిషనర్‌గా ఉన్న సమయంలో టీఎస్సార్ కాంప్లెక్స్‌లో నాటక గ్రంథాలయం ఏర్పాటు చేసినట్లు ఆయన గుర్తు చేసుకున్నారు. తెలుగు నాటకాల డిజిటలైజేషన్‌ను మొదట వెంపటి రాధాకృష్ణ ప్రారంభించారని, ఆయనను స్ఫూర్తిగా తీసుకుని మన్నం వెంకటరాయుడు సహకారంతో ఈ నాటకాలను డిజిటలైజ్ చేయడం అభినందనీయమన్నారు. రైటర్స్ అకాడమీ చైర్మన్ వి.వి.రమణమూర్తి కృషితో ఈ వెబ్‌సైట్ ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు మాట్లాడుతూ పుస్తక పఠనంపై ఆసక్తి తగ్గిపోతున్న ప్రస్తుత తరుణంలో నాటకాలను డిజిటలైజ్ చేసి వెబ్‌సైట్‌లో పొందుపరచడం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. డాక్టర్ మన్నం వెంకటరాయుడు మాట్లాడుతూ తమ ఫౌండేషన్ ద్వారా ఇప్పటివరకు 40 వేల కథలను వెబ్‌సైట్‌లో ఉంచామని, ప్రతి నెలా 5 వేల మందికి పైగా వాటిని వీక్షించి చదువుతున్నారని చెప్పారు. ఇంకా 75 వేల కథలు వెబ్‌సైట్‌లో పెట్టాల్సి ఉందని వెల్లడించారు. కార్యక్రమంలో సినిమాటోగ్రాఫర్ ఎం.వి.రఘు, విశ్రాంత ఐపీఎస్ అధికారి అత్తిలి సుధాకర్, నటుడు కొల్లి మోహనరావు, మేడా మస్తాన్‌రెడ్డి, వెంపటి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
‘తెలుగు నాటక డిజిటల్
గ్రంథాలయం’
వెబ్‌సైట్ ప్రారంభం