
ఎవరో?
మున్నా భాయ్
● ఢిల్లీ నుంచి 25 గ్రాముల కొకై న్ విశాఖకు తీసుకొచ్చిన నిందితులు ● ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ దొరకడం నగరంలో ఇదే తొలిసారి ● బయటకు పొక్కనివ్వకూడదంటూ కూటమి నేతల ఫోన్లు ● మున్నాతో టీడీపీ నేతలకు సంబంధాలున్నట్లుగా గుర్తింపు ● తెర వెనుక పేర్లు బయటపడనీయకుండా కూటమి నేతల ఒత్తిళ్లు ● డ్రగ్స్ దొరికినా నోరు మెదపని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్
ప్రశ్నించే పవన్.. ఏమయ్యారు..?
‘నార్కోటిక్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్ మారుతోంది. గంజాయికి నిలయంగా ఏపీ తయారైంది. ఏ రాష్ట్రంలో గంజాయి దొరికినా.. ఏపీ నుంచి.. ముఖ్యంగా విశాఖపట్నం నుంచి వెళ్తోంది. రాష్ట్రాన్ని గంజాయి హబ్‌గా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మార్చేసింది’
● ప్రతిపక్షంలో ఉన్న సమయంలో చీమ చిటుక్కుమంటే చాలు ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇదిగో ఇలా ట్వీట్స్‌తో సోషల్‌మీడియాలో రెచ్చిపోయేవారు.
● కట్ చేస్తే.. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి కేసులు పెరుగుతూ వస్తున్నాయి. రాష్ట్రంలో ఎటు చూసినా గంజాయి పట్టుబడుతోంది. విశాఖలో వరుసగా డ్రగ్స్ దొరుకుతున్నాయి. ఇంత జరుగుతున్నా పవన్ కల్యాణ్ మాత్రం మౌనముని అవతారమెత్తేశారు. ఏమీ జరగనట్లు తనకేమీ తెలియనట్లుగా నిద్ర నటిస్తున్నారు.
సాక్షి, విశాఖపట్నం : నగరంలో డ్రగ్స్ రవాణా వెనుక పెద్ద తలలే ఉన్నట్లు తెలుస్తోంది. కూటమి నేతల వారసులే మత్తు పదార్థాల సూత్రధారులనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దొరికిన వారే దొంగలన్నట్లుగా చిత్రీకరించి.. డ్రగ్స్ రవాణా వెనుక ఎవరి హస్తం ఉందన్న అంశాలను కూటమి నేతలు తొక్కిపెట్టేందుకు తెరవెనుక ప్రయత్నాలు జోరుగా చేస్తున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన ఓ టీడీపీ ఎంపీ పోలీసులపై ఒత్తిళ్లు తీసుకొస్తున్నారని తెలుస్తోంది. కీలక సూత్రధారిగా ఉన్న అక్షయ్‌కుమార్ అలియాస్ మున్నా కాల్ రికార్డులను పరిశీలించిన పోలీసులు అతడికి కొంతమంది కూటమి నేతలతో సంబంధాలున్నట్లుగా గుర్తించినట్లు సమాచారం. సెంట్రల్ ఏజెన్సీ సమాచారంతో డ్రగ్ పెడ్లర్స్‌పై దాడులు నిర్వహించిన త్రీ టౌన్ పోలీసులు రెండురోజుల క్రితం నగర చరిత్రలోనే భారీ మొత్తంలో డ్రగ్స్‌ను పట్టుకున్నారు. 25 గ్రాముల కొకైన్‌తోపాటు రూ.3.5 లక్షల నగదు, కారు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ రాకెట్‌ను ఛేదించిన కొద్ది గంటల వ్యవధిలోనే పోలీసులకు కూటమి నేతల నుంచి ఫోన్లు రావడం మొదలయ్యాయి. అప్పటికే డ్రగ్స్ పట్టుకున్నట్లు బయటకు తెలియడంతో పోలీసులు వివరాలు వెల్లడించారు. అయినా కూటమి నేతల నుంచి ఒత్తిళ్లు ఆగకపోవడంతో పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు.
డ్రగ్స్ వచ్చిన గంటలోనే ఓ నేతకు ఫోన్
దక్షిణాఫ్రికాకు చెందిన థామస్‌తోపాటు విశాఖకు చెందిన అక్షయ్ కుమార్ అలియాస్ మున్నా ఇందులో కీలకంగా వ్యవహరించారు. డ్రగ్స్‌ని ఢిల్లీ నుంచి విశాఖకు తీసుకొచ్చిన గంట వ్యవధిలోనే ఉత్తరాంధ్రకు చెందిన ఓ నాయకుడికి ఫోన్ కాల్ వెళ్లినట్లు పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. మున్నా ఫోన్‌లో కాంటాక్ట్ లిస్ట్‌లోనూ, కాల్ లిస్ట్‌లోనూ ఓ ఎంపీ ఫోన్ నంబర్‌తో పాటు టీడీపీ నేతలు, వారి వారసుల ఫోన్ నంబర్లు ఉన్నట్లు సమాచారం. అరెస్ట్ చేసిన ఐదుగుర్ని విచారించిన పోలీసులు.. వారి వద్ద నుంచి మరో ముగ్గురు పేర్లు రాబట్టారు. ఈ ముగ్గురికీ రాజకీయ నేతలతో సత్సంబంధాలు ఉండటం, ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం విశేషం. వారిని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన క్షణాల వ్యవధిలోనే కూటమి నేతల నుంచి పోలీసులకు ఫోన్ల మీద ఫోన్లు వచ్చేశాయని తెలుస్తోంది. దీంతో పోలీసులు తాము తీసుకొచ్చిన ముగ్గుర్నీ కేవలం 10 నిమిషాల్లోనే బయటకు పంపించేశారని సమాచారం. తేనె తుట్టె కదిపితే.. కూటమి నేతలు, వారి వారసుల పేర్లు డ్రగ్స్ రాకెట్‌లో బట్టబయలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో.. విచారణ ముందుకు జరగకుండా అడ్డుపడుతున్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఒత్తిళ్లకు లొంగకుండా విచారిస్తే.. మున్నా వెనుక ఉన్న భాయ్ ఎవరనేది తెలిసే అవకాశం ఉన్నా.. ప్రభుత్వం మాత్రం డ్రగ్స్ కేసును తొక్కి పెట్టేందుకు చూస్తోంది.
డ్రగ్స్ కేసులో వైద్యుడి అరెస్టు
ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు ఆదివారం కూర్మన్నపాలేనికి చెందిన వైద్యుడు శ్రీకృష్టచైతన్యను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అతడు డ్రగ్స్ కోసం అక్షయ్ కుమార్‌కు రూ.65 వేలు చెల్లించినట్లు విచారణలో పేర్కొన్నాడు. అతడికి వైద్య పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

ఎవరో?