
అప్పుల కుప్ప.. యోగాంధ్ర గొప్ప
● యోగాసనాలకు రూ.75 కోట్లు ఖర్చు ● ప్రభుత్వం విదిల్చింది కేవలం రూ.28 కోట్లు ● పనులు చేసిన కాంట్రాక్టర్లకు పెండింగ్‌లో బిల్లులు ● కలెక్టరేట్ చుట్టూ కాంట్రాక్టర్ల ప్రదక్షిణలు
మహారాణిపేట: యోగాంధ్ర రికార్డుల మాటెలా ఉన్నా.. అప్పుల భారం మాత్రం తలనొప్పిగా మారింది. టెంట్ల నుంచి స్నాక్స్ వరకు బిల్లుల చెల్లింపులతో అధికారుల తలబొప్పి కడుతోంది. యోగాంధ్ర పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు బిల్లుల కోసం కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తమ బిల్లులు చెల్లించాలని అధికారుల వద్ద మొర పెట్టుకుంటున్నారు. యోగాంధ్ర కార్యక్రమం పూర్తి అయి 15 రోజులు అవుతున్నా ఇంకా ఎలాంటి బిల్లులు చెల్లించలేదని వ్యాపారులు, కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. గత నెల 21న విశాఖలో యోగా విన్యాసాల కార్యక్రమం నిర్వహించారు. ప్రధాని మోదీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబా బు, ఇతర ప్రముఖలతో కార్యక్రమం పూర్తయింది. దాదాపు 3 లక్షల మందితో యోగాసనాలు వేసి గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కారు. ఈ కార్యక్రమం నిర్వహణకు సుమారు రూ.75 కోట్లు ఖర్చు జరిగిందని అధికారులు చెబుతున్నారు. యోగాంధ్ర నిర్వహణ కు కూటమి సర్కార్ రెండు విడతల్లో రూ.28 కోట్లు విడుదల చేసింది. మిగిలిన నిధులు విడుదల చే యాలని జిల్లా యంత్రాంగం లేఖ కూడా రాసింది.
కంపార్ట్‌మెంట్ల నిర్మాణానికి భారీగా ఖర్చు
విశాఖ ఆర్‌కె బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు మొత్తం 368 కంపార్ట్‌మెంట్లు నిర్మించారు. ఒక్కొక్క కంపార్ట్‌మెంట్‌లో 1000 మంది ఉండేలా రూపొందించారు. దీనికే బిల్లు తడిసి మోపుడయింది. అరకొర నిధులతో చేపట్టిన పలు పనులు అంచనాలు మించిపోయాయి. వీటితో పాటు స్టేజీల నిర్మాణం కూడా జరిగింది. యోగా వేడుకల్లో పాల్గొనే వారికి కేంద్ర ప్రభుత్వం మ్యాట్లు, టీ షర్ట్‌లు ఇచ్చింది. అలాగే స్నాక్స్ కూడా పంపిణీ చేశారు. దాదాపు రూ.8 నుంచి రూ.9 లక్షల వరకు స్నాక్స్, ఇతర ఆహార పదార్థాల కోసం వెచ్చించారు. అలాగే వీఐపీలు, వీవీఐపీలకు హోటళ్లలో బస, వారు తిరగడానికి కార్ల ఏర్పాటు వంటి వాటికి భారీగా ఖర్చయింది. అయితే అయిన ఖర్చులో సగానికి పైగా చెల్లింపులు జరగలేదు. ఫలితంగా ఈ పనులు చేసిన కాంట్రాక్టర్లు బిల్లుల కోసం ఇబ్బందులు పడుతున్నారు. బిల్లుల కోసం కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.