
పనిమనిషే దొంగ
● సుజాతనగర్‌లోని ఓ ఇంట్లో 17 తులాల బంగారం, వజ్రాలు మాయం ● చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు ● సొత్తు స్వాధీనం
పెందుర్తి: తాను పనిచేస్తున్న ఇంటికే కన్నం వేసి, యజమానులకు దాదాపు రూ. 22 లక్షల విలువైన బంగారు, వజ్రాభరణాలను అపహరించిన ఓ ఘనురాలిని పోలీసులు అరెస్టు చేశారు. మూడేళ్లుగా నమ్మకంగా పనిమనిషిగా ఉంటూ, యజమాని కుటుంబం లేని సమయం చూసి చేతివాటం ప్రదర్శించిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వెస్ట్ జోన్ క్రైమ్ ఏసీపీ డి. లక్ష్మణరావు శనివారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. సుజాతనగర్ మెయిన్ రోడ్డు సమీపంలో నివసించే మండపాటి రాఘవేంద్ర, కొత్తవలస మండలం మంగళపాలెంలోని గురుదేవ ఆస్పత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్నారు. ఆయన భార్య కూడా ఉద్యోగిని. ఈ క్రమంలో మూడేళ్ల క్రితం ఇంటి పనుల కోసం వేపగుంట సమీపంలోని వరలక్ష్మీనగర్‌కు చెందిన తనుబుద్ది సత్యవతిని పనిమనిషిగా నియమించుకున్నారు. సత్యవతి నమ్మకంగా ఉండటంతో, రాఘవేంద్ర దంపతులు విధులకు వెళ్లినప్పుడు ఇంటి బాధ్యతలను ఆమెకే అప్పగించేవారు. గత నెల 25న రాఘవేంద్ర దంపతులు విధులకు వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చిన తరువాత బీరువా తెరవడానికి ప్రయత్నించగా లోపల వస్తువులన్నీ చిందరవందరగా ఉన్నాయి. దీంతో అనుమానం వచ్చిన రాఘవేంద్ర బీరువాను పరిశీలించగా అందులో ఉన్న సుమారు 206.86 గ్రాముల బంగారం, రూ. 2 లక్షల విలువైన వజ్రాభరణాలు మాయమైనట్లు గుర్తించారు. వెంటనే పెందుర్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా పనిమనిషి సత్యవతి కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. విచారణలో ఆమె చోరీకి పాల్పడినట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ప్రశ్నించగా సత్యవతి నేరం ఒప్పుకుందని ఏసీపీ తెలిపారు. చోరీ సొత్తును ఆమె నుంచి స్వాధీనం చేసుకుని నిందితురాలిని రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ లక్ష్మణరావు వివరించారు.ఈ కేసులో ప్రతిభ కనబరిచిన వెస్ట్ జోన్ సీఐ ఎన్. శ్రీనివాసరావు, పెందుర్తి ఎస్‌ఐ డి. సూరిబాబు, ఏఎస్‌ఐ కె. శ్రీనివాసరావు, హెచ్‌సీలు జి. నాగరాజు, టి. పద్మజ, పీసీలు ఎల్. సింహాచలం నాయుడు, ఎల్. త్రిమూర్తులు, టి. శివప్రసాద్, బి. దేముడునాయుడు, ఎల్.కె. తాతారావు, ఆర్. సంతోషి, పి. హైమావతి, జి. శ్రీనివాసరావు, వి. విజయ్‌కుమార్, యూ. చంద్రకళలను ఉన్నతాధికారులు అభినందించారు.

పనిమనిషే దొంగ