
సంకల్పంతో స్వర్ణాంధ్ర సాధిద్దాం
ప్రజా ప్రతినిధులతో జరిగిన సమీక్షలో కలెక్టర్
మహారాణిపేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీ–4 విధానం అమలు, ఆచరణలో అందరూ కలిసి రావాలని, సంపూర్ణ సహకారం అందించటం ద్వారా స్వర్ణాంధ్ర సాధనలో భాగస్వామ్యం కావాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. స్వర్ణాంధ్ర–2047, జిల్లా, నియోజవర్గ స్థాయి ప్రణాళికపై శనివారం సాయంత్రం కలెక్టరేట్‌లో ఆయన అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, విష్ణుకుమార్ రాజు, పంచకర్ల రమేశ్ బాబు, వంశీకృష్ణ శ్రీనివాస్, వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర–2047 విజన్‌లో భాగంగా పీ–4 విధానం అమలవుతుందని తెలిపారు. సమాజంలో దిగువ స్థాయిలో ఉన్న 20 శాతం మంది ప్రజలను పైకి తీసుకొచ్చేందుకు ఉన్నత స్థాయిలో ఉన్న ప్రజలు ముందుకు రావాల్సి ఉందన్నారు. కార్యక్రమ పర్యవేక్షణకు ఇన్‌చార్జి మంత్రి అధ్యక్షతన జిల్లా స్థాయిలో కమిటీ ఉంటుందన్నారు. పీ–4 విధానం అమల్లో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు 73 వేల బంగారు కటుంబాలను గుర్తించామని, వాటిని మార్గదర్శకులకు అనుసంధానం చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర సాధనలో భాగంగా పేద ప్రజలకు ముందుగా ప్రభుత్వ యంత్రాంగం నుంచి అందాల్సిన సాయాన్ని అందించాలని, తర్వాత మిగిలిన వర్గాల నుంచి సాయం తీసుకోవాలని ప్రజా ప్రతినిధులు సూచించారు. స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామికవేత్తలు, సమాజంలో ఆర్థికంగా స్థిరపడిన వారి నుంచి సహాయం తీసుకుని పీ–4 విధానాన్ని పక్కాగా అమలు చేద్దామని, స్వర్ణాంధ్ర కలల సాకారాన్ని నిజం చేద్దామని ప్రజా ప్రతినిధులంతా పేర్కొన్నారు. అనంతరం అధికారులు, సామాజిక వేత్తల నుంచి సలహాలు, అభిప్రాయాలు సేకరించారు. వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు, పారిశ్రామికవేత్తలు, సీఐఐ ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.