
వారసత్వం, సమర్థత కలిగిన నేత మాధవ్
సీతంపేట: పి.వి.చలపతిరావు వారసుడిగా రాజకీయ ప్రవేశం చేసి, స్వయంకృషితో అంచెలంచెలుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగిన పీవీఎన్ మాధవ్‌ను పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు అభినందించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు అధ్యక్షతన శనివారం పోర్టు కళావాణి స్టేడియంలో ఆత్మీ య అభినందన సభ జరిగింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ శ్రీ భరత్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యేలు గణబాబు, పంచకర్ల రమేష్‌బాబు, పి.విష్ణుకుమార్ రాజు, బండారు సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు దాడి వీరభద్రరావు, పీలా గోవింద్, విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి ఆనంద్, మాజీ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, సత్యారావు తదితరులు మాధవ్‌ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మాధవ్ ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం కలిగిన నాయకుడని ప్రశంసించారు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి స్థాయికి ఎదగడం గొప్ప విషయమన్నారు. మాధవ్ తండ్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారని, ఆ తర్వాత విశాఖ నుంచి కంభంపాటి హరిబాబు రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారని గుర్తు చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి ఎంపీలు, ఎమ్మెల్యేల అభినందనలు