
ప్రజారోగ్యం, సుందరీకరణకు ప్రాధాన్యం
మహారాణిపేట: పారిశుధ్య నిర్వహణ, పచ్చదనం పెంపుదల, ప్రజారోగ్య పరిరక్షణ వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వ సంస్థలు, జిల్లా యంత్రాంగం, జీవీఎంసీ కలిసి పనిచేయాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ సూచించారు. ఆయా సంస్థల మధ్య సమన్వయం లోపించకుండా ఉండేందుకు ప్రత్యేక ప్రతినిధులను నియమించుకోవాలని ఆదేశించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని స్థానిక సంస్థలు, కేంద్ర సంస్థలు వ్యవహరించాల్సి ఉంటుందని నిర్దేశించారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో మంగళవారం జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్‌తో కలిసి కేంద్ర సంస్థల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశమయ్యారు. కేంద్ర సంస్థలు తప్పకుండా జీవీఎంసీతో అనుసంధానమై పారిశుధ్య చర్యలు చేపట్టాలన్నారు. ప్రధానంగా పోర్ట్, రైల్వే, గెయిల్, ఎన్‌హెచ్‌ఏఐ, ఐవోసీఎల్, స్టీల్‌ప్లాంట్, హెచ్‌పీసీఎల్, కోరమాండల్, గంగవరం పోర్టు పరిసరాల్లో పారిశుధ్య సమస్యలపై ఇరువర్గాల వారు క్షేత్రస్థాయి పరిశీలన చేసి శాశ్వత చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.
నాలుగు అంశాలపై దృష్టి సారించాలి
ప్రజారోగ్యం దృష్ట్యా కేంద్ర సంస్థలు ప్రధానంగా నాలుగు అంశాలపై దృష్టి సారించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అన్నారు. ఆయా కేంద్ర పరిశ్రమలు, సంస్థలు, యూనిట్ల పరిధిలో పక్కా పారిశుధ్య చర్యలు చేపట్టాలని, ప్రత్యేక సిబ్బందిని నియమించుకుని నిరంతరం ఈ ప్రక్రియను కొనసాగించాలని సూచించారు. మురుగునీరు పారేందుకు అడ్డంకులు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. పూడిక తొలగింపు పనులు ఎప్పటికప్పుడు చేపట్టాలని పేర్కొన్నారు. అలాగే పచ్చదనం పెంపుదలకు, సుందరీకరణకు అధిక ప్రాధాన్యమివ్వాలన్నారు. జీవీఎంసీ సీఎంవో నరేష్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.