
అర్చకుడి అదృశ్యంపై లోతుగా దర్యాప్తు
భీమునిపట్నం: భీమిలిలోని భ్రమరాంబికా సహిత చోడేశ్వరస్వామి ఆలయ అర్చకుడు ఏడిద గణేష్ సుబ్రహ్మణ్య శాస్త్రి(49) అదృశ్యంపై దర్యాప్తునకు ఎస్‌ఐ స్థాయి అధికారిని నియమించినట్లు సీఐ తిరుమలరావు తెలిపారు. పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ కేసు వివరాలు వెల్లడించారు. అర్చకుడు ఈ ఏడాది ఏప్రిల్ 24న తిరుపతి బయలుదేరి వెళ్లినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. 26న ఆయన నుంచి ఫోన్ వచ్చిందని, ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని చెప్పారు. కాగా.. అర్చకుడికి మద్యం సేవించే అలవాటు ఉంది. గతంలోనూ ఇలానే పలు ప్రాంతాలను వెళ్లిన శాస్త్రి కొద్ది రోజుల తర్వాత ఇంటికి వచ్చేవారు. అలానే వస్తారని కుటుంబ సభ్యులు వేచి చూశారు. అయినప్పటికీ రాకపోవడంతో మే 4న తిరుపతి స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అక్కడి పలు ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో అర్చకుడి ఆచూకీ పరిశీలించగా లభించలేదు. దీంతో అతని భార్య మాధురి మే 13న భీమిలి స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తర్వాత ఈ కేసులో ఎటువంటి పురోగతి కనిపించలేదు. దీంతో గత నెల 23న ‘భీమిలి అర్చకుడు తిరుపతిలో అదృశ్యం’శీర్షికన ‘సాక్షి’లో వార్త ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో పోలీసులు గత నెల 25న తిరుపతి వెళ్లి.. అర్చకుడి కోసం గాలించారు. ఈ క్రమంలో అర్చకుడి ఫోన్ తిరుపతిలో ఒక వ్యక్తి ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అతన్ని విచారించారు. అర్చకుడి వద్ద డబ్బులు లేకపోవడంతో రూ.700లకు ఫోన్‌ను విక్రయించినట్లు విచారణలో తేలింది. ఫోన్‌తో పాటు నలుగురిని అదుపులోకి తీసుకుని పూర్తిస్థాయిలో విచారించినప్పటికీ.. అర్చకుడి ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో పోలీసులు 30న భీమిలికి తిరిగి వచ్చేశారు. ఈ కేసును మరింత లోతుగా విచారించడానికి ఎస్‌ఐ స్థాయి అధికారిని నియమించినట్లు సీఐ తెలిపారు.