
రాజీమార్గమే శ్రేయస్కరం
మహారాణిపేట: జిల్లాలో ఎన్టీఆర్ సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ మంగళవారం 94.04 శాతం పూర్తయింది. పింఛన్ల పంపిణీ పూర్తయిన తర్వాతే బదిలీ అయిన సచివాలయ ఉద్యోగులు రిలీవ్ కావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో.. చేసేది లేక ఎక్కడి వారు అక్కడే ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లాలో మొత్తం 1,58,681 పింఛన్లు ఉండగా, ఇందుకోసం ప్రభుత్వం రూ.69,60,82,500 విడుదల చేసింది. మంగళవారం రాత్రి 7 గంటల సమయానికి 94.04 శాతం అంటే 1,49,173 మందికి రూ.65.26 కోట్ల అందజేశారు. బయోమెట్రిక్ గుర్తింపు ద్వారా లబ్ధిదారులకు సచివాలయ సిబ్బంది పింఛన్లు అందజేశారు. మిగిలిన వారికి బుధవారం అందజేస్తామని డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ లక్ష్మీపతి తెలిపారు.
5న మెగా లోక్ అదాలత్
విశాఖ లీగల్: రాజీ మార్గమే రాజమార్గమని జిల్లా న్యాయ సేవా ప్రాధికార సంస్థ కార్యదర్శి ఆర్.సన్యాసినాయుడు అన్నారు. ఈ నెల 5న జరగనున్న మెగా లోక్ అదాలత్ సందర్భంగా.. న్యాయమూర్తి బ్యాంకు, చిట్‌ఫండ్ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాజీపడటానికి వీలున్న అన్ని కేసులను పరిష్కరించే దిశగా కృషి చేయాలని వారికి సూచించారు. బ్యాంకుల్లో పెండింగ్‌లో ఉన్న చెక్ బౌన్స్ కేసుల్లో ఇరువర్గాలు రాజీ చేసుకోవడానికి ముందుకు రావాలని కోరారు. చిట్‌ఫండ్ కంపెనీలు కూడా తమ పరిధిలో సాధ్యమైనంత మేరకు ఇరువర్గాలు రాజీ కుదుర్చుకోవాలని న్యాయమూర్తి సూచించారు.