విశాఖలో గుర్రపు స్వారీ | Sakshi
Sakshi News home page

విశాఖలో గుర్రపు స్వారీ

Published Mon, May 27 2024 3:50 PM

విశాఖలో గుర్రపు స్వారీ

బైక్‌ రైడింగ్‌, కారు డ్రైవింగ్‌కు ఎన్నో శిక్షణా కేంద్రాలు ఉంటాయి. చాలా మంది వాటిని నేర్చుకునేందుకే ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. అదే బాటలో ఇప్పుడు గుర్రపు స్వారీ కోసం శిక్షణ కేంద్రం విశాఖలో సిద్ధమవుతోంది. దీంతో కనుమరుగవుతున్న గుర్రపు స్వారీ.. వాటిపై ఆసక్తి ఉన్న ఔత్సాహికులకు చేరువకానుంది. – ఆరిలోవ

ముడసర్లోవ ప్రాంతం కొత్తదనం సంతరించుకుంటోంది. విశాలమైన రోడ్లు, చుట్టూ పచ్చని కొండలు, మధ్యలో రిజర్వాయర్‌తో ఆహ్లాదకరమైన ఈ ప్రాంతం రూపురేఖలు మారనున్నాయి. ఇందులో భాగంగా ముడసర్లోవ పార్కులో భాగమైన రోజ్‌ పార్కులో గుర్రపు స్వారీ శిక్షణ కేంద్రం అందుబాటులోకి రానుంది. జీవీఎంసీ అధికారులు స్మార్ట్‌ సిటీలో భాగంగా ఈ కేంద్రం నిర్మాణం చేపడుతున్నారు. సుమారు రూ.6 కోట్లతో ఈ శిక్షణ కేంద్రం నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. సుమారు నాలుగు ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం చేపడుతున్నారు. ఇప్పటికే పాత పార్కు చుట్టూ ఉన్న గోడలను తొలగించారు. దాని మధ్యలో గుర్రాలు విశ్రాంతి కోసం షెల్టర్లు, సందర్శకులు తిలకించేందుకు షెల్టర్లు, కౌంటర్లు, గుర్రాలు స్వారీ చేసే రింగులు నిర్మిస్తున్నారు. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరిలోవ ప్రాంతంలో పలు అభివృద్ధి పనులు జరిగాయి. ఇంతవరకు నగరంలో ఎక్కడా లేని గుర్రపు స్వారీ శిక్షణ అందుబాటులోకి రానుండడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హార్స్‌ రైడింగ్‌పై ఆసక్తి ఉన్నవాళ్లు ఇక్కడ శిక్షణ పొందేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

రోజ్‌ పార్కులో శిక్షణ కేంద్రం

రూ.6 కోట్లతో నిర్మాణం

శరవేగంగా పనులు

Advertisement
 
Advertisement
 
Advertisement