కూటమిలో ‘కమలం’ కలకలం!

విశాఖ పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకు వినతిపత్రం అందజేస్తున్న నాయకులు - Sakshi

విశాఖ లోక్‌సభ సీటు ఆశించి భంగపాటు

 టీడీపీకి కేటాయింపుపై బీజేపీ క్యాడర్‌తిరుగుబావుటా

 ఎంపీ జీవీఎల్‌కు ఇవ్వాలని డిమాండ్‌

 పొత్తు సహకారంపై అనుమానాలు

 అభ్యర్థి భరత్‌ ప్రచారానికి దూరంగా శ్రేణులు

 ముఖ్య నేతలు అనకాపల్లికే ప్రాధాన్యం

సాక్షి, విశాఖపట్నం: కూటమిలో ‘కమలం’ కలకలం రేపుతోంది. ఎవరూ ఊహించని రీతిలో కమల దళం కూటమిపై తిరగబడింది. విశాఖ లోక్‌సభ సీటు తమ కు దక్కుతుందని ఆ పార్టీ శ్రేణులు గట్టి నమ్మకంతో ఉన్నారు. అయితే అనూహ్యంగా ఆ సీటును టీడీపీకి కేటాయించడంతో వీరు కంగుతిన్నారు. ఈ టికెట్‌ను టీడీపీ అభ్యర్థి, లోకేష్‌ తోడల్లుడు భరత్‌కు ఖరారు చేసినప్పట్నుంచి వీరంతా తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.

ఆయనకు మద్దతుగా ప్రచారానికి వెళ్లకుండా దూరంగా ఉంటున్నారు. ఈ తరుణంలో ఒకడుగు ముందుకేసి విశాఖ లోక్‌సభ సీటును మార్పుచేసి బీజేపీకివ్వాలంటూ ఆ పార్టీ క్యాడర్‌, అనుబంధ సంఘాల నాయకులు మంగళవారం విశాఖలోని ఆ పార్టీ కార్యాలయం ఆవరణలోనే ఆందోళన చేపట్టడం, ఈ సీటును మూడేళ్లుగా విశాఖ అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావుకు ఇవ్వాలని డిమాండ్‌ చేయడం సంచలనమైంది. అంతేకాదు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పార్టీని అమ్మేశారని, తమ అధిష్టానం, టీడీపీ అధినేత చంద్రబాబు మోసం చేశారంటూ బహిరంగ విమర్శలకు ది గడం చర్చనీయాంశమైంది. మిత్రపక్షం బీజేపీ శ్రేణుల నుంచి ఇలాంటి పరిస్థితి ఊహించని టీడీపీలో ఈ పరిణామం పెను దుమారానికి దారితీసింది.

జీవీఎల్‌కు ఇవ్వాలని జాతీయ అధ్యక్షుడికి లేఖ
విశాఖ ఎంపీ సీటును ఆశించి భంగపడ్డ జీవీఎల్‌ మూడు రోజుల క్రితం మీడియాతో మాట్లాడుతూ తనకు ఈ టికెట్‌ రాకపోవడానికి సామాజిక, రాజకీయ సమీకరణాలు కారణం కాదని, కేవలం కుటుంబ సమీకరణాలేనని కుండబద్దలు కొట్టారు. త్వరలోనే పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలతో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని కూడా వెల్లడించారు. అందులోభాగంగానే ఆ పార్టీ శ్రేణులు తాజాగా తిరుగుబావుటా ఎగరేశారని పలువురు భావిస్తున్నారు. మరో ఆసక్తి రేపే అంశం ఏమిటంటే.. తాము డిమాండ్‌ చేసినట్టు టీడీపీ అభ్యర్థిని మార్పు చేసి బీజేపీకి కేటాయించని పక్షంలో విడిగా స్నేహపూర్వక పోటీకి అనుమతించాలని కోరడం. ఒకవేళ టీడీపీ సీటును మార్చకపోతే తాము కూటమి అభ్యర్థికి సహకరించబోమని చెప్పకనే చెప్పినట్టయింది.

ఇప్పటికే విశాఖ లోక్‌సభ ఉమ్మడి అభ్యర్థి భరత్‌కు మద్దతుగా బీజేపీ నుంచి ఆశించిన స్థాయిలో ప్రచారానికి ఎవరూ వెళ్లడం లేదు. పరిస్థితిని గమనించి భరత్‌ ఇటీవల నగరంలోని బీజేపీ కార్యాలయానికి వెళ్లారు. ఆ సమయంలో ఒకరిద్దరు మినహా చెప్పుకోదగ్గ నాయకులు లేకుండా పోయారు. పైగా భరత్‌కు దూరంగా ఉంటూ కొంతమంది నాయకులు పొరుగున ఉన్న అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్‌ కోసం ప్రచారానికి వెళ్లడానికే ప్రాధాన్యతనిస్తున్నారు. అసలే టీడీపీకి ప్రజాదరణ అంతంత మాత్రంగా ఉన్న తరుణంలో బీజేపీ క్యాడరు ఎదురు తిరగడం, టీడీపీ అభ్యర్థిని మార్పు చేసి జీవీఎల్‌కు ఇవ్వాలంటూ ఏకంగా జాతీయ అధ్యక్షుడు నడ్డాకు లేఖ రాయడం కూటమికి మింగుడు పడడం లేదు.

Election 2024

Read latest Visakhapatnam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top