
అధికారులకు సూచనలిస్తున్న కమిషనర్ సాయికాంత్ వర్మ
కమిషనర్ సాయికాంత్ వర్మ
డాబాగార్డెన్స్: విశాఖ మ్యూజియం నిర్వహణ పటిష్టంగా చేపట్టాలని జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. జీవీఎంసీ అదనపు కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్‌తో కలసి సోమవారం విశాఖ మ్యూజియంను పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మిలాన్–2024కు వివిధ దేశాల ప్రతినిధులు విశాఖ విచ్చేస్తున్నారని, వారి సందర్శనార్థమై మ్యూజియంను ఆధునికీకరించినట్లు చెప్పారు. అనంతరం మరమ్మతులు చేపట్టిన మారీటైమ్, హెరిటేజ్ మ్యూజియంను పరిశీలించారు. మ్యూజియంలో మంచి చిత్రాలు ఏర్పాటు చేయాలని అదనపు కమిషనర్‌కు కమిషనర్ సూచించారు. పురాతన విగ్రహాలు మరింత అందంగా కనిపించేందుకు ఫోక్ లైట్లను ఏర్పాటు చేయాలని పర్యవేక్షక ఇంజనీర్ సత్యనారాయణరాజును, మ్యూజియం ఆవరణలో మొక్కలు నాటి సుందరంగా తీర్చిదిద్దాలని డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ దామోదర్‌ను, పురాతన వస్తువులు, విలువైన వస్తువులను నిత్యం గమనిస్తూ.. భద్రతా చర్యలు చేపట్టాలని క్యూరేటర్ రమణను ఆదేశించారు. అనంతరం పాండురంగాపురం సమీపం ఆఫీసర్స్ క్లబ్ పక్కన నిర్మాణంలో ఉన్న జీవీఎంసీ గెస్ట్‌హౌస్‌ను పరిశీలించారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని పర్యవేక్షక ఇంజినీర్‌ను ఆదేశించారు. ఈఈ రత్నాకర్‌రెడ్డి పాల్గొన్నారు.