ప్రతి విజ్ఞప్తికీ పరిష్కారం చూపిస్తాం | Sakshi
Sakshi News home page

ప్రతి విజ్ఞప్తికీ పరిష్కారం చూపిస్తాం

Published Wed, Nov 29 2023 1:24 AM

-

రాజకీయ పార్టీల ప్రతినిధులతో

ఓటర్ల జాబితా పరిశీలకులు శ్యామలరావు

మహారాణిపేట: రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదుకు, విజ్ఞప్తికీ నాణ్యమైన పరిష్కారం చూపిస్తామని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, విశాఖ జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకుడు జె.శ్యామలరావు పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా ఆయన మంగళవారం కలెక్టరేట్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. తప్పులతో కూడిన జాబితాలను రూపొందిస్తున్నారని, కొంతమంది సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. వలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారని బీజేపీ నేత విష్ణుకుమార్‌ రాజు ఆరోపించారు. కొన్ని చోట్ల అర్హత ఉన్నప్పటికీ ఓట్లను తొలగిస్తున్నారని టీడీపీ విశాఖ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు విజ్ఙప్తి చేశారు. ఒకే కుటుంబంలోని ఓటర్లకు వేర్వేరు చోట్ల పోలింగ్‌ కేంద్రాలను కేటాయించారని పరిశీలకుల దృష్టికి తీసుకొచ్చారు. రాజకీయ పార్టీల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదుకు తప్పకుండా పరిష్కారం చూపిస్తామని, తగిన చర్యలు తీసుకుంటామని జె.శ్యామలరావు పేర్కొన్నారు. తమ పరిధిలో ఉండే అంశాలకు తక్షణమే చర్యలు తీసుకుంటామని, లేని పక్షంలో కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అనుమతులు తీసుకుంటామని బదులిచ్చారు. కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున ఇప్పటివరకు రాజకీయ పార్టీల నుంచి వచ్చిన వినతులపై తీసుకున్న చర్యల గురించి వివరించారు. ఈ ఏడాది అక్టోబర్‌ 26వ తేదీ నాటికి జిల్లాలో 19,15,682 మంది ఓటర్లు ఉండగా డ్రాఫ్ట్‌ వెరిఫికేషన్‌ తర్వాత ఈనెల 26వ తేదీ నాటికి 19,15,316కు చేరుకున్నారని వివరించారు. క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని, పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమావేశంలో వైఎస్సార్‌ సీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ, సీపీఎం, ఆప్‌, బీఎస్పీ తదితర పార్టీల నుంచి పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement