జూలో విషాదం | Sakshi
Sakshi News home page

జూలో విషాదం

Published Tue, Nov 28 2023 12:58 AM

యానిమల్‌ కీపర్‌ నగేష్‌ మృతదేహంపై గాయాలు పరిశీలిస్తున్న ఆరిలోవ పోలీసులు, జూ సిబ్బంది - Sakshi

● యానిమల్‌ కీపర్‌పై ఎలుగుబంటి దాడి ● ఎన్‌క్లోజర్‌లోనే యువకుడి మృతి

ఆరిలోవ : విశాఖ జూలో కలకలం రేగింది. ఎలుగుబంటి దాడిలో యానిమల్‌ కీపర్‌ నగేష్‌బాబు మృతి చెందాడు. సోమవారం ఉదయం 8 గంటలకు నగేష్‌ డ్యూటీకి వచ్చాడు. 9 గంటలు సమయంలో ఎలుగుబంటిని డేక్రాల్‌లోకి విడిచిపెట్టడానికి వెళ్లాడు. నైట్‌ క్రాల్‌లో ఉన్న ఎలుగుబంటిని లిఫ్ట్‌ట్‌ డోర్‌ తెలిచి డే క్రాల్‌ (సందర్శకులు చూసే ఎన్‌క్లోజరు)లోకి విడిచిపెట్టాడు. మళ్లీ ఆ డోర్‌ మూయడం మరిచిపోయి నైట్‌క్రాల్‌ను శుభ్రం చేస్తుకొంటున్నాడు. ఆ ఎలుగుబంటి తెరిచి ఉన్న డోర్‌ ద్వారా డే క్రాల్‌ నుంచి మళ్లీ నైట్‌క్రాల్‌లోకి ప్రవేశించి నగేష్‌పై దాడిచేయగా అక్కడిక్కడే మృతి చెందాడు.

నిర్లక్ష్యమే కారణమా

జూలో జరిగిన సంఘటనపై ఇది ఎవరి నిర్లక్ష్యమో తెలియని పరిస్థితి నెలకొంది. యానిమల్‌ కీపర్‌ నగేష్‌బాబు నిర్లక్ష్యంతో డోర్‌ మూయకుండా ఉండటం ఒక్కటే కారణమా అనే దానిపై సందర్శకులు నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎలుగుబంటి దాడి చేసినప్పుడు సాధారణంగా యానిమల్‌ కీపర్‌ కేకలు వేసి ఉంటాడు. అక్కడే అందుబాటులో ఉన్న సెక్యూరిటీ గార్డు ఆ కేకలు విని వెళ్లాల్సి ఉంది. అయినా సంఘటన జరిగిన గంట తర్వాత డాక్టర్‌ వచ్చి పిలవమన్నంతవరకు ఆ గార్డు వెళ్లలేదు. ఆ ఎన్‌క్లోజరు కొండ అంచున ఉంది. తోడు లేకుండా ఒక్క కీపర్‌ మాత్రమే నైట్‌క్రాల్‌లోకి వెళ్లి గంటన్నర వరకు తిరిగి రాకపోయినా ఎవ్వరూ పట్టించుకోకపోవడం విశేషం. ఆ సమయంలో అక్కడ బాధ్యతలు చూడాల్సిన జూ అధికారులు ఆచూకీ దరిదాపుల్లో కనిపించకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. సాధారణంగా రేంజర్‌, సెక్షన్‌ ఆఫీసర్‌ ఆ సమయంలో రౌండ్స్‌ వేస్తూ అన్ని నైట్‌క్రాల్స్‌, డే క్రాల్స్‌ పర్యవేక్షించాల్సి ఉంది. ఇదిలా ఉండగా నగేష్‌ ..భవానీమాల ధరించారు. ఎలుగుబంటి తిరిగి నైట్‌క్రాల్‌లోకి వచ్చి ఆయన వేసుకొన్న ఎరుపు రంగు బట్టలకు ప్రతిస్పందించి దాడి చేసిందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

అనుభవంలేని కీపర్‌..

గతంలో ఇక్కడ ఎటుగుబంటి ఎన్‌క్లోజరు వద్ద అనుభవిజ్ఞుడైన యానిమల్‌ కీపర్‌ను ఏడాదిన్నర క్రితం నిషాచర జీవుల గృహ వద్దకు మార్చేశారు. ఆయన స్థానంలో ఇక్కడ అనుభవంలేని కొత్తగా చేరిన నగేష్‌బాబును నియమించారు. అనుభవం తక్కువ కావడం వల్లే నగేష్‌బాబు తెరిచిన డోరు మూయకుండా నిర్లక్ష్యం వహించాడని సమాచారం.

జూ చరిత్రలో ఇది రెండో సంఘటన..

విశాఖ జూ చరిత్రలో ఇలాంటిది రెండో సంఘటన. సుమారు 20 ఏళ్ల క్రితం ఎలుగుబంటి ఎన్‌క్లోజరులో శుభ్రం చేస్తున్న జూ మహిళా సిబ్బందిపై కూడా దాడి జరిగింది. ఎలుగుబంటి దాడిచేయడంతో ఆ మహిళ మృతి చెందింది. మళ్లీ సోమవారం జరిగిన ఎలుబంటి దాడిలో యానిమల్‌ కీపర్‌ మృతి చెందాడు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement