బాలికను వేధించి.. సొమ్ము దోచేసి..

9వ తరగతి విద్యార్థినికి

సోషల్‌ మీడియాలో బెదిరింపులు

కూర్మన్నపాలెం: సోషల్‌ మీడియా వేదికగా 9వ తరగతి చదువుతున్న బాలికను వేధిస్తూ డబ్బులు దోచేసిన వ్యక్తిపై దువ్వాడ పోలీస్‌స్టేషన్‌లో సోమ వారం కేసు నమోదైంది. సీఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాలివీ.. దువ్వాడ స్టేషన్‌ పరిధిలోని ఓ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న బాలిక రోజూ లాగానే ఈ నెల 22న స్కూల్‌కి వెళ్తున్నా అని ఇంట్లో చెప్పి.. స్కూల్‌కు వెళ్లకుండా ఎటో వెళ్లిపోయింది. దీంతో ప్రిన్సిపాల్‌ ఆమె తల్లికి ఫోన్‌ చేసి.. బాలిక స్కూల్‌కు రాలేదని చెప్పారు. కంగారు పడిన ఆమె స్కూల్‌కి వెళ్లి ఆరా తీసింది. సాయంత్రం వరకు అక్కడే ఉంది. స్కూల్‌ ముగిసే సమయానికి వచ్చిన బాలికను ఎక్కడకు వెళ్లావని ప్రశ్నించగా.. ఏడుస్తూ ఉండిపోయింది. ఇంటికి తీసుకువెళ్లి ప్రశ్నించగా.. సోషల్‌ మీడియాలో ఓ వ్యక్తి బెదిరిస్తున్నాడని చెప్పింది. దీంతో తల్లితో పాటు పాఠశాల సిబ్బంది బాలికను ఫాలో అయ్యారు. తర్వాత రోజు బాలిక ఆటోలో వస్తుండగా.. ఆటోను ఓ కారు ఫాలో అవ్వడం గమనించారు. తర్వాత స్కూల్‌ పక్కనే ఉన్న వీధిలో బాలిక ఓ వ్యక్తితో మాట్లాడటం గుర్తించి.. గట్టిగా నిలదీశారు. దీంతో బాలిక విస్తుపోయే నిజాలు చెప్పింది. ‘మార్చిలో నా స్నేహితురాలి పేరుతో వాట్సాప్‌లో ఓ మేసేజ్‌ వచ్చింది. ఓ న్యూడ్‌ వీడియో పంపి.. నన్ను కూడా అలాగే పంపమని మేసేజ్‌లో ఉంది. నేను అలానే చేశా. రెండు రోజుల తర్వాత స్కూల్‌కి వచ్చి నా ఫ్రెండ్‌ను వీడియో గురించి అడిగాను. తనకు ఏమీ తెలియదని, ఆ నంబర్‌ కూడా తనది కాదని చెప్పింది. దీంతో అదే రోజు వాట్సాప్‌లో న్యూడ్‌ వీడియో పెట్టిన వ్యక్తిని ఎవరు మీరు అని ప్రశ్నించాను. అతను నువ్వు నాకు తెలుసు.. లక్ష రూపాయలు ఇస్తే వీడియో డిలీట్‌ చేస్తాను. లేదంటే వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తాను అని బెదిరించాడు.’ అని వారికి చెప్పింది. అతనికి బయపడిన బాలిక దఫదఫాలుగా రూ. 30 వేలు, రూ.10 వేలు, రూ.5వేలు చొప్పున ఇంట్లో దొంగతనం చేసి బెదిరిస్తున్న వ్యక్తికి ఇచ్చింది. ఇంకా డబ్బులు కావాలని అడుగుతుండడంతో తన దగ్గర లేవని చెప్పింది. అయితే తాను చెప్పినట్లు చేయాలని, తన ఫ్రెండ్‌తో వెళితే వీడియో డిలీట్‌ చేస్తానని అతను బాలికకు చెప్పాడు. దీంతో ఈ నెల 22న ఉదయం స్కూల్‌కు వెళ్లకుండా యువకుడు చెప్పినట్లుగా ఆ వ్యక్తితో వెళ్లింది. అయినప్పటికీ అతను ఇంకా మూడు లక్షలు తీసుకురావాలని బెదిరిస్తున్నాడని తల్లికి చెప్పింది. ఈ ఘటనపై బాలిక తల్లి దువ్వాడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు వెదుళ్లనరవకు చెందిన మాటూరి సాయిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతనిపై సోమవారం కేసు నమోదు చేశారు.

Read latest Visakhapatnam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top