భరోసా.. బాధ్యత

విద్యా, వసతి దీవెన అందుకోనున్న విద్యార్థులు (ఫైల్‌)
 - Sakshi

● విద్య, వసతి దీవెన పంపిణీలో మరింత పారదర్శకత ● ఇప్పటి వరకు విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాలో డబ్బులు ● ఇక నుంచి స్టూడెంట్‌–తల్లి జాయింట్‌ అకౌంట్‌ ● ఈ నెల 24 నాటికి జాయింట్‌ ఖాతాలు తెరిచేలా ఏర్పాట్లు ● ఈ నెల 28న బ్యాంకు ఖాతాల్లో విద్యాదీవెన డబ్బులు

విశాఖ విద్య: జగనన్న విద్య, వసతి దీవెన పథకం మరింత పారదర్శకంగా అమలు చేసేలా ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటి వరకు విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుండగా, ఇక నుంచి విద్యార్థి జాయింట్‌ అకౌంట్‌లో డబ్బులు పడనున్నాయి. నిరుపేద వర్గాల ఉన్నత చదువులకు అండగా నిలవాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న జగనన్న విద్య, వసతి దీవెన పథకం ప్రయోజనం ద్వారా విద్యార్థుల బాధ్యతను పెంచేలా ఇటువంటి మార్పులకు శ్రీకారం చుట్టారు. డిప్లమో, డిగ్రీ, పీజీ, ప్రొఫెషనల్‌ కోర్సులు అభ్యశించే అర్హులైన నిరుపేద వర్గాలకు చెందిన విద్యార్థులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తోంది. ఇది పేదవర్గాల పిల్లలకు ఎంతో ఆర్థిక భరోసాగా నిలుస్తోంది.

జిల్లాలో 27,781 మంది లబ్ధిదారులు

జిల్లాలో 27,781 మంది విద్యార్థులు జగనన్న విద్య, వసతి దీవెన పథకం ద్వారా లబ్ధిపొందుతున్నారు. వీరిలో గ్రేటర్‌ విశాఖ మండలం పరిధిలో 24,109 మంది విద్యార్థులు ఉన్నారు. అదేవిధంగా భీమిలి మండలంలో 667 మంది, ఆనందపురంలో 902 మంది, పెదగంట్యాడలో 701 మంది, పెందుర్తి మండలంలో 593 మంది విద్యార్థులు ప్రయోజనం అందుకుంటున్నారు.

ఆ ఐదు బ్యాంకుల్లోనే అత్యధికం..

జిల్లాలో 27,781 మంది విద్యార్థులు జగనన్న విద్య, వసతి దీవెన పథకం ప్రయోజనం పొందేందుకు అర్హులని లెక్క తేల్చారు. వీరిలో 27,310 మందికి బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్నట్లు గుర్తించారు. అత్యధికంగా స్టేట్‌బ్యాంకు ఆఫ్‌ ఇండియాలో 9,028 మంది అకౌంట్లు కలిగి ఉన్నారు. అదే విధంగా యూనియన్‌ బ్యాంకులో 6,540 అకౌంట్లు, ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస బ్యాంకులో 4,974, బ్యాంకు ఆఫ్‌ ఇండియాలో 2,044, కెనరా బ్యాంకులో 1,847 మంది అకౌంటు కలిగి ఉన్నారు. మరో ఏడు బ్యాంకుల్లో వంద నుంచి ఏడు వందల లోపు అకౌంట్లు, మరో 23 బ్యాంకుల్లో వందలోపు చొప్పునే అకౌంట్లు ఉన్నాయి.

లక్ష్యం సాధించేలా..

జిల్లాలో జగనన్న విద్యా, వసతి దీవెన పొందుతున్నవారికి ఇప్పటికే వారి తల్లి పేరుతో ఉన్న బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారు. ఇదే ఖాతాకు విద్యార్థిఽ పేరుతో జాయింట్‌ అకౌంట్‌గా మార్పు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసమని బ్యాంకు అధికారులను సమన్వయం చేసుకునేలా సంక్షేమ శాఖలకు చెందిన అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ నెల 28న 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించిన జగనన్న విద్యా దీవెన డబ్బులు జమ కానున్నాయి. ఈ లోగానే జాయింట్‌ బ్యాంకు ఖాతాలు ప్రక్రియ పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం

విద్యార్థి, తల్లి పేరుతో జాయింట్‌ బ్యాంకు ఖాతాలు తెరిపించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నెల 24 నాటికి లక్ష్యం పూర్తి చేసేలా స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నాం. జిల్లాలోని ప్రతీ కాలేజీకి ఓ హెచ్‌డబ్ల్యూవోను బాధ్యుడిగా చేసి, దీనిని ఏఎస్‌డబ్ల్యూవో/ఏటీడబ్ల్యూవోలను పర్యవేక్షణ అధికారులుగా నియమించాం. జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ మల్లికార్జున సూచనలకు అనుగుణంగా బ్యాంకర్లతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నాం.

– కె.రామారావు, డిప్యూటీ డైరెక్టర్‌,

విద్యా, వసతి దీవెన జిల్లా నోడల్‌ అధికారి

Read latest Visakhapatnam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top